అందోల్, డిసెంబర్ 4: సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెద్ద తలనొప్పిగా మారాయి. రెబెల్స్ బెడద ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నది. నియోజకవర్గంలో 9 మండలాలు ఉన్నాయి. అందోల్, పుల్కల్, చౌటకూర్, మునిపల్లి, వట్పల్లి, రాయికోడ్ మండలాలు సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తాయి. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండలాలు మెదక్ జిల్లాలోకి వస్తాయి. 9 మండలల్లోని చాలా గ్రామాల్లో కాంగ్రెస్ మద్దుతుదారులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండి సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు.
నామినేషన్ల విత్‌డ్రాకు ససేమిరా అంటూ పల్లె ఎన్నికల్లో వేడిని రాజేస్తున్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో పలుసార్లు కూర్చుని మాట్లాడుకున్నా రెబెల్స్ బెడదకు పరిష్కారం దొరకడం లేదు. దీంతో మంత్రి దామోదర దగ్గరకు చేరింది. అయినా అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవడానికి ససేమిరా అంటున్నారు. అందోల్ మండలంలోని నేరడిగుంటలో కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఇద్దరు కూడా మంత్రి ఆశీస్సులతోనే నామినేషన్లు వేశామని, ఎట్టి పరిస్థితిలో వెనక్కు తగ్గ్గేది లేదంటున్నారు. నేరడిగుంటను కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ గ్రామంగా ఎంపిక చేయగా, మంత్రి దామోదర ముఖ్య అనుచరుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి స్వగ్రామం కావడం విశేషం.
సంగుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో సైతం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేసి, పోటీకి సై అంటున్నారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట, సింగూర్, బస్వాపూర్ గ్రామాల్లో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయగా, గొంగులూర్లో ఏకంగా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చౌటకూర్ మండలం చక్రియాల్‌లో ఇద్దరు, శివంపేట్‌లో ముగ్గురు, వెంకటకిష్టాపూర్, పోసానిపల్లి తదితర గ్రామా ల్లో ఇద్దరు చొప్పున నామినేషన్లు వేసి బరిలో ఉన్నారు.
మునిపల్లి మండలం బుదేరాలో ఇద్దరు, బుస్సారెడ్డిపల్లిలో ముగ్గురు, అల్లాపూర్‌లో ఇద్దరు, మునిపల్లిలో ముగ్గురు, చీలపల్లిలో ఇద్దరు, బేలూర్‌లో ఇద్దరు, తాటిపల్లిలో ముగ్గురు, పెద్దచెల్మడలో ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుదారులుగా నామినేషన్లు వేశారు. వట్పల్లి మండలంలో సైతం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువగానే ఉన్నది. ఒక్కో గ్రామంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండేందుకు నామినేషన్లు వేశారు. గొర్రెకల్‌లో ఏకంగా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ఒక్కరూ కూడా నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు సుముఖంగా లేరని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రాయికోడ్ మండలంలో సైతం రెబెల్స్ తీవ్రంగా ఉంది. ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండల్లాలో సైతం రెబెల్స్ బెడద తప్పడంలేదు.
పాత కాంగ్రెస్.. కొత్త కాంగ్రెస్
కొన్ని గ్రామాల్లో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్‌గా అభ్యర్థులుగా విడిపోయి నామినేషన్లు వేయగా, ఇది ఎక్కడివరకు దారితీస్తుందోనని పార్టీశ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. టేక్మాల్ మండలం కుసంగిలో కొన్నేండ్లుగా పార్టీకి సేవచేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకుడు నామినేషన్ వేశారు. ఎన్నికల ముం దు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అదే గ్రామానికి చెందిన మరో నాయకుడు నామినేషన్ వేసి పోటీకి రెడీ అంటున్నాడు. దీంతో పాత కాంగ్రెస్ వర్గం దీనిపై గుర్రుగా ఉన్నది. మంత్రి దామోదర ఒక్కమాట చెప్పి అతడితో నామినేషన్ విత్‌డ్రా చేయిస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుందని, కానీ.. ఆ దిశగా ఆయన చొరవ చూపకపోవడంతో పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదని మండిపడుతున్నారు. ఏదీఏమైనా పంచాయతీ ఎన్నికలు అందోల్ కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీని రాజేసేలా కనపడుతున్నది. నామినేషన్ల ఉపసంహరణ వరకు రెబెల్స్ మనసు మార్చుకుంటారా? లేదంటే పోటీలో ఉంటారా? అని కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందుతున్నది.