సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 20: మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతులు అధైర్యపడేలా వ్యాఖ్యలు చేస్తూ వారి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మ ల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వంటి అనేక వినూత్నమైన పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 11 విడతల్లో రూ.72 వేల కోట్లను రైతు బంధు కింద పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎలాంటి కారణం చేతనైనా రైతులు మరణిస్తే వారి ఖాతాలో రైతు బీమా జమ చేశారన్నారు. రైతు రుణ మాఫీ కింద రూ.29వేల కోట్లను కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అందించిందన్నారు. కాళేశ్వరం ద్వారా పంట సాగు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
అధికారంలోకి వస్తే మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట పక్కనపెట్టారని విమర్శించారు.కనీసం రెండు పంటలకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. నెలలు గడిచినా రైతు బీమా చెల్లించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. తిరిగి కేసీఆర్ అధికారంలోకి రావాలని, అప్పుడే పేదల బతుకులు బాగుపడతాయన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా పాలిస్తున్న తీరును ఎండగట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చక్రపాణి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్ నాయక్, షేక్ సాబేర్ పాల్గొన్నారు.