గుమ్మడిదల, ఫిబ్రవరి 22: సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జాతీయ రహదారిపై శనివారం మహిళా, రైతు జేఏసీ నాయకులు సంయుక్తంగా నోటికి మాస్కులు ధరించి మౌనపోరాటం చేశారు. గుమ్మడిదలలోని అంబ్కేదర్ చౌరస్తాలో శనివారం 12వ రోజు రిలే నిరాహార దీక్షలో సనాథ్, రాజు ఫ్రెండ్స్ సంఘం సభ్యులు కూర్చున్నారు. నల్లవల్లిలో 18వ రోజు మైనార్టీలు రిలే నిరాహార దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా గుమ్మడిదల రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, మద్దుల బాల్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు ఏర్పాటు తమ ప్రాంతానికి అన్నివిధాలుగా నష్టాన్ని చేకూరుస్తుందని తెలిపారు. 18 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు డంపింగ్ యార్డు ఏర్పాటు విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.