సిద్దిపేట, నవంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పాత మెదక్ జిల్లా అభివృద్ధి కుంటుపడింది.ఏడాదిగా జిల్లాకు ప్రభుత్వం నుంచి ఆశించిన నిధులు రావడం లేదు. దీంతో జిల్లా అభివృద్ధి పనులకు నోచుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో మంజూరై నడుస్తున్న పనులు తప్పా మరోటి లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చ లేదు. ఏదో ఘనకార్యం చేసినట్లుగా ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తుండగా, విపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు రాక పాలన కుంటుపడింది. మున్సిపాలిటీలు నిధుల లేమితో ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ప్రభుత్వం నుంచి నిధుల వరద పారింది.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టింది. కేసీఆర్, హరీశ్‌రావు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పదేండ్లలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. డిసెంబర్ 9తో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తి కానున్నది. కానీ, ఈ ఏడాది పాలనలో జిల్లాలో పైసా అభివృద్ధి జరగలేదు.బీఆర్ఎస్ హయాంలో శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులకు నిధులు ఆపడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లకు మంజూరైన నిధులు ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో దెబ్బతిన్న రోడ్లతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్యన ఉండి అభివృద్ధి పనులు, కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజల మధ్యకు రావడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భయపడుతున్నారు. పంట రుణమాఫీ పూర్తిగా కాలేదు. జిల్లాలో వేల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రూ.15 వేల చొప్పున ఇస్తామన్న రైతుభరోసా ఇవ్వడం లేదు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం మోసం చేసింది. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తానని చెప్పి మోసం చేసింది. పత్తి, ధాన్యం సేకరణలో ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అసమర్ధతతో దళారులకు, వ్యాపారులకు పంటను విక్రయిస్తున్నారు.
ఏం చేశారని విజయోత్సవాలు?
ఏడాది పాలనలో ఏం చేశారని విజయోత్సవాలు జరుపుతున్నారని జిల్లా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్న ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులకు నిధులు అపినందుకా ఈ విజయోత్సవాలు అని విమర్శిస్తున్నారు. సిద్దిపేట వెటర్నరీ కళాశాలను రద్దు చేసి, దాని నిర్మాణ పనులను ఫిల్లర్ల స్థాయిలోనే ఆపేశారు. రూ. 100 కోట్లు రద్దు చేయడంతో ఎంతో మంది విద్యార్థులను చదువుకు దూరం చేసింది కాంగ్రెస్ సర్కార్. జిల్లా రహదారులకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.150 కోట్ల నిధులను రద్దు చేయడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టును కక్ష కట్టి ప్రభుత్వం రద్దుచేసింది. సిద్దిపేట కోమటి చెరువు శిల్పారామం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. మెదక్ మెడికల్ కళాశాలను 100 సీట్ల నుంచి 50 సీట్లకు సీఎం రేవంత్ కుదించారు. గ్రామపంచాయతీలు ఆర్థ్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
పారిశుధ్య కార్మికులకు సరిగ్గా వేతనాలు రావడం లేదు. గత ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామాలకు నిధులు రాకపోవడవడంతో పంచాయతీ కార్యదర్శులపై ఆర్థ్ధిక భారం పడుతున్నది. పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో ఉన్న చిన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అన్ని జీపీలకు పంచాయతీ కార్యదర్శులను నియమించింది.కార్యదర్శులపై ఆర్థ్ధిక భారం పడకుండా నెలనెలా పల్లె ప్రగతి ద్వారా ప్రత్యేక నిధులు విడుదల చేసింది.దీంతో గ్రామాలు అభివృద్ధి జరిగింది. పచ్చని చెట్లు, పారిశుధ్యం, ఇంటింటా చెత్త సేకరణ సజావుగా చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేదు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్పా, మిగతావి ఏవీ అమలు కావడం లేదని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏడాది కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేకపోవడం విశేషం.