సిద్దిపేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇటీవల వారం రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల పరిధిలోని రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 405 కి.మీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. శాశ్వత మరమ్మతులకు అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూనే ఉన్నారు.
వీటిలో మెదక్ జిల్లాలో 210 కి.మీటర్లు, సిద్దిపేట జిల్లాలో 40కి.మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 155 కి.మీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు ఎంత లేదన్నా రూ. 300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యం అని చెప్పాలి. ఇంకా అంచనాలు పంపే పనిలోనే ఉమ్మడి జిల్లా అధికార యం త్రాంగం ఉంది. ఉమ్మడి జిల్లాలో రోడ్ల మరమ్మతులకు వందల కోట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం అక్కడక్కడ తాత్కాలిక పనులు మాత్రమే చేపడుతున్నారు.మళ్లీ ఒక పెద్ద వర్షం వస్తే అంతే సంగతులు.
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు, వరదలకు భారీగా నష్టం జరిగింది. రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయి పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. వాటిని పునరుద్ధరించంలో అంతంత మాత్రంగానే పనులు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున వరదలు, వర్షాలు వచ్చినా ప్రభుత్వ చర్యలు అరకొరగానే ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టి పది రోజులు దాటుతున్నా ఇంత వరకు శాశ్వత పనులు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో ఇంత వరకు ప్రయాణాలు కూడా జరగడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా మెదక్ జిల్లాను వరదలు అతలాకుతలం చేశాయి.
వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగింది. పలు చోట్ల రహదారులు తెగిపోవడంతో పాటు బ్రిడ్జిలు కూలిపోయాయి. కల్వర్టులు దెబ్బతిన్నాయి. మెదక్ – సిద్దిపేట రహదారిలో నిజాంపేట మండలం నందిగామ వద్ద కల్వర్టు దెబ్బతిని రాకపోకలు బందయ్యాయి. ఇంకా తాత్కాలిక పనులు పూర్తి స్థాయిలో చేపట్టలేదు. వెల్దుర్తి, యశ్వంతరావుపేట గ్రామాల మధ్య ఇటీవల తాత్కాలికంగా ప్రైవేట్ క్రషర్ మిషన్ యజమానులు రోడ్డు వేసుకున్నారు.పటాన్చెరు మండలం పాటి గ్రామంలో రోడ్డు బాగు చేయించాలని అక్కడి కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు.ఇలా చాలా చోట్ల తాత్కాలిక పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇలా పలు మార్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.నిధులు లేక అధికారులు సైతం ఏంచేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు.
ఇటీవల భారీ వర్షాలు, వరదలతో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీగా నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రజల కష్ట సుఖాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. వరదల సమయంలో ఏరియల్ సర్వేలో కామారెడ్డికి వెళ్లాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి అనుకోకుండా మెదక్‌కు వచ్చారు. సీఎం వచ్చారు జిల్లాకు లాభం జరుగుతుంది అనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ఎదో వచ్చామా….. పోయా మా… అన్నట్లు వచ్చారు తప్పా జిల్లాకు ఏం ప్రయోజనం చేకూరలేదు. కనీసం సీఎం వచ్చిన పనుల పురోగతి అంతంత మాత్రమే.
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ఇంతవరకు వరదలు, వర్షాలపైన సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు.కేవలం వర్షం కురిసిన రోజు మాత్రమే వచ్చి మెదక్‌లో రివ్యూ పెట్టి… వరద ప్రాంతాల్లో అలా పర్యటించి వెళ్లిపోయారు.జిల్లాకు అవసరమైన నిధులు విడుదల చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారు.జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌తో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు దామెదర్ రాజనర్సింహ,పొన్నం ప్రభాకర్ నిధులు తీసుక రావడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం వరదలు, వర్షాలతో దెబ్బతిన్న రహదారులను బాగు చేయించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.