Komuravelli Mallikarjuna | చేర్యాల, జూలై 12 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. ఈ ఆలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో అభివృద్ధి పనులతో పాటు పరిపాలనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుత ఇన్చార్జి ఈవో ఎ.బాలాజీ 2020 నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తూ వేతనం హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కార్యాలయం నుంచి తీసుకుంటున్నారు. మల్లన్న ఆలయంలో పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తిచేయడానికి, సిబ్బంది మధ్య చోటేచేసుకుంటున్న గొడవలు, కేసులు తదితర సమస్యల నేపథ్యంలో రెగ్యులర్ ఈవోను నియమించాలనే వినతిని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
ఇటీవల టంకశాల వెంకటేశ్ అనే అధికారిని రెగ్యులర్ ఈవోగా నియమిస్తూ ఆర్డర్లు జారీ అయ్యాయి. కానీ, ఆయన వేతనం కొమురవెల్లి మల్లన్న ఆలయం నుంచి తీసుకోవాలని, విధులు మాత్రం దేవాదాయశాఖ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించాలని ఆర్డర్లో పేర్కొన్నారు. లాంగ్ స్టాడింగ్ ఉద్యోగులను బదిలీ చేస్తామనడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులతో పాటు కొట్లాడుకున్న ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని ఇటీవల భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ప్రకటించినా దానికి అతీగతీ లేదు.
జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయ అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 29న జరిగే మల్లన్న కల్యాణోత్సవం రోజున అమ్మవార్లకు బంగారు కీరిటాలను సమర్పిస్తామని మంత్రి కొండా సురేఖ ప్రకటించినా, కిరీటాల తయారీకి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. రెగ్యులర్ ఈవో లేక మల్లన్న క్షేత్రంలో పాలన గాడి తప్పుతున్నదనే విమర్శలు ఉన్నాయి. కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. క్యూలైన్ నిర్మాణాలు, 50 కాటేజీల భవనాల పనులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది.
ఇద్దరు ఏఈవోలు, 35 మంది సిబ్బంది, 27 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 63 మంది దినసరి వేతనంతో ఆలయంలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అభివృద్ధి పనుల నిర్వహణ కోసం నల్లగొండ జిల్లా నుంచి వచ్చే డీఈతో పాటు మరో ఏఈ విధులు నిర్వహిస్తున్నారు.ఈవో లేని సమయంలో విధులు నిర్వహించాల్సిన ఏఈవోలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలయని పరిస్థితి ఉంది. ఉద్యోగుల్లో సమన్వయం కరువైంది. ఇటీవల ముగ్గురు ఉద్యోగులు కొట్టుకుని పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లారు. అభివృద్ధి పనులను నిత్యం పర్యవేక్షించాల్సిన డీఈ, ఏఈలు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.