పటాన్చెరు రూరల్, నవంబర్ 8 : సిగాచి బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. సీఎం రేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామి వాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు, సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 8 మంది కార్మికులు, సిబ్బంది జాడ నేటికీ దొరకలేదు. అప్పట్లో సిగాచి ప్రమాదంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. స్వయంగా సీఎం రేవంత్ సిగాచి పరిశ్రమను పరిశీలించి పరిశ్రమ యజమాన్యాన్ని ఒప్పించి మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని హామీనిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. లక్ష పరిహారం ఇస్తామన్నారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ కార్మికులకు రూ. 10లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ. 5లక్షలు ఇచ్చేలా పరిశ్రమ యాజమాన్యాన్ని ఆదేశిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం రూ. 2లక్షల నష్ట పరిహారం చెల్లిస్తుందని సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. రూ. 1.3 కోట్లు మృతుల కుటుంబాలకు అందాలి. సిగాచి ప్రమాదంపై రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్‌ను వేయగా, హైకోర్టు పలు ఆసక్తికర ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వంపై సంధించింది. రూ. కోటి చొప్పున పరిహారం ఎంత మంది బాధిత కుటుంబాలకు చెల్లించారని జడ్జిలు ప్రశ్నించారు.
ఫ్యాక్టరీలో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే అరెస్టులు ఎందుకు జరగలేదని నిలదీసింది. సిగాచి ప్రమాదం దర్యాప్తుపై, పరిహారం చెల్లింపుపై అధికారుల తీరును, రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు ప్రశ్నించింది. సిగాచి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్ తరపు న్యాయవాది నాలుగు నెలలు గడిచిన బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం అందలేదని కోర్టుకు వివరించారు. దర్యాప్తులో జాప్యం జరుగుతున్నందున సిట్‌కు అప్పగించాలని న్యాయవాది వసుధా నాగరాజ్ కోరారు. ఒక్కో కుటుంబానికి కౌంటర్ దాఖలు చేసేనాటికి రూ. 40లక్షలు, అదృశ్యమైన వారి కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున పరిశ్రమ పరిహారం డబ్బులు విడుదల చేసిందని ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి ధర్మాసనానికి తెలిపారు.
చెల్లింపులు ఇలా…
వాస్తవంగా సిగాచి పరిశ్రమ ఇచ్చిందని చెబుతున్న రూ. 40లక్షలు ఆ పైన 13మందికి అందజేసినట్టు, 11 మందికి రూ. 30లక్షలకు పైగా అందజేసినట్టు కార్మికశాఖ అధికారుల నివేదికలో ఉంది. 46 మందికి రూ. 26లక్షలు మాత్రమే నేటి వరకు అందాయి. 11మంది కార్మికులు, పరిశ్రమ సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్ ఉన్నందుకు వారికి రావాల్సిన ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్, ఇతర ఇన్సూరెన్స్‌లను కలిపి రూ. 40లక్షలకు పైగా అందజేసినట్టు నివేదికలో తెలిపారు. చికిత్స పొందుతూ విషమించి చనిపోయిన వారి నష్టపరిహారాల్లో చికిత్సకు అయిన ఖర్చును చూపించడం వివాదాస్పదం అవుతున్నది. పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయాలతో మరణించిన వ్యక్తికి పరిశ్రమ, అధికారులు చికిత్స చేయించకుండా అతడి సొంత ఖర్చుతో చికిత్స పొందినట్టుగా చేయడం కార్మిక కుటుంబాల్లో అసంతృప్తిని కల్గిస్తున్నది.
ఆ రోజు ప్రమాదంలో మరణించింది 54 మంది, వారిలో 8మంది ఆచూకీ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష చొప్పున మిస్సింగ్ కార్మికుల కుటుంబాలకు అందజేయలేదు. బాధిత కుటుంబాలు తమ సొంత రాష్ర్టాలకు వెళ్లకుండా మూడు నెలలు ఇక్కడే వేచి ఉన్నారు. డబ్బులు చెల్లించేలా లేరని భావిస్తూ వారు తమ సొంతరాష్ర్టాలకు వెళ్లారు. నిత్యం వాట్సాప్ గ్రూపుల్లో, పేపర్లలో నష్టపరిహారం కోసం ఆసక్తితో గమనిస్తున్నా రు. స్థానికంగా ఉన్న తెలుగు రాష్ర్టాల బాధిత కుటుంబాల వ్యక్తులు మాత్రం అధికారుల వద్దకు వెళ్లి తమకు మిగిలిన నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని ఆశగా అడుగుతున్నారు. అక్కడ విధుల్లో ఉన్న పరిశ్రమ ఉన్నతాధికారులు మాత్రం యాజమాన్యం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, తమకు ఏ సమాచారం లేదని చెబుతున్నారు. రూ. 75ల క్షలు పెద్ద మొత్తం కావడంతో బాధితులు ఆశ గా ఎదురుచూస్తున్నారు. కేంద్రం ఇచ్చే రూ. 2లక్షల కోసం సైతం ఎదురుచూస్తున్నారు.
ఆచూకీ లేనివారికి డెత్ సర్టిఫికెట్ ప్రశ్నార్థకం…
సిగాచి ప్రమాదంలో 8మందికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. వారు కాలి బూడిదయ్యారని అధికారులు, పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడేండ్లు ఒక వ్యక్తి ఆచూకీ లభించని పక్షంలోనే అతడు మరణించినట్టుగా అధికారికంగా ప్రకటిస్తారు. సిగాచిలో మిస్సయిన కార్మికులకూ ఈ నిబంధన మేరకు 7 ఏండ్లకు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. ప్రమాదంలో మరణించే ముందు వారు పరిశ్రమలోకి వచ్చినట్టుగా అటెండెన్స్, సీసీ టీవీ రికార్డులు, బయోమెట్రిక్ ఆధారాలు ఉండటంతో వారు అగ్ని ప్రమాదంలో బూడిదయ్యారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇలా గల్లంతైన 8మందికి తొలుత పరిశ్రమ, అధికారులు కలిసి రూ. 15లక్షలు తక్షణ సాయంగా అందజేశారు. అనంతరం మరో రూ. 10లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. మొత్తం 25లక్షలు వారికి అందజేశారు.
మిస్సింగ్ కార్మికుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్ ఇస్తామని సంగారెడ్డి జిల్లా అధికారులు హామీనిచ్చారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల్లోనే డెత్ సర్టిఫికెట్లు ఇప్పించి వారికి నష్టపరిహారం వచ్చేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇప్పుడు నాలుగు నెలలు గడుస్తున్నా అదృశ్యమైన కార్మికుల పేరున డెత్ సర్టిఫికెట్ జారీ కావడం లేదు. డెత్ సర్టిఫికెట్లు రాక బాధిత కుటుంబాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. వీరితో పాటు రూ. 75లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇప్పిస్తుందో తెలియక మిగిలిన బాధిత కుటు ంబాలు ఆవేదనతో ఉన్నాయి. రూ. 60లక్షల నష్టపరిహారం ఎప్పు డు ఇస్తారో తెలియక మరికొందరు ఆశతో వేచి చూస్తున్నారు.
పరిహారం ఇప్పిస్తాం
నష్టపరిహారం చెల్లింపులు వేగవంతం చేశాం. సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాం. కంపెనీ ద్వారా రూ.25లక్షల చొప్పున 54మందికి అందాయి. 11 మందికి ఈసీ యాక్ట్ ద్వారా రూ.40లక్షలకు పైగా అందాయి. ఈడీఎల్ఐ ద్వారా మరికొందరికి రూ.7 లక్షల చొప్పున అందించాం. యావరేజ్‌గా చాలా కుటుంబాలకు రూ. 40లక్షల నుంచి రూ.45లక్షల వరకు పరిహారం అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. లక్ష చొప్పున 46 కుటుంబాలకు అందించాం. మిస్సింగ్ వ్యక్తుల కుటుంబాలకు మాత్రమే రూ.25లక్షల చొప్పున అందాయి. ఇదే నివేదికను హైకోర్టుకు సమర్పించాం. త్వరలో అందరికీ న్యాయం జరుగుతుంది. పరిశ్రమ ఇస్తున్న నష్టపరిహారం తక్షణం కార్మికుల కుటుంబాలకు అందజేస్తున్నాం. చిన్న పిల్లలున్న బాధిత కుటుంబాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయిస్తున్నాం.
-రవీందర్‌రెడ్డి, డిప్యూటీ లేబర్ కమిషనర్, పటాన్చెరు
రూ. 25 లక్షలే ఇచ్చారు
మాది జార్ఖండ్ రాష్ట్రం. మా తమ్ముడు ఇర్ఫాన్ అన్సారీ (22) సిగాచిలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ డ్యూటీలో కాలి బూడిదయ్యాడు. శవం లభించలేదు. సిగాచి పరిశ్రమ వద్దనుంచి అధికారులు నష్టపరిహారంగా రూ. కోటి చెప్పి రూ. 25లక్షలే ఇప్పించారు. మిగిలిన డబ్బులు ఇస్తారనే ఆశతో నేను, మా సోదరులం ఇస్నాపూర్‌లోనే ఉంటున్నాం. మూడు నెలలు చూసి మళ్లీ జార్ఖండ్ వచ్చేశాం. మొత్తం డబ్బులు ఇచ్చేలా తెలంగాణ సీఎం చొరవ తీసుకోవాలి. డెత్ సర్టిఫికెట్లు ఇంతవరకు ఇవ్వలేదు. డెత్ సర్టిఫికెట్‌ను త్వరగా ఇవ్వాలి.
-షోయబ్ అన్సారీ, బాధితుడు
రూ. కోటి త్వరగా చెల్లించాలి
మా ఆయన పేరు బాలకృష్ణ. 15 ఏండ్లు సిగాచి పరిశ్రమ లో ప్యాకింగ్ డిపార్టుమెంట్లో విధులు నిర్వహించాడు. ఆ రోజు జరిగిన పేలుడులో మా ఆయన మృతిచెందాడు. నష్టపరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. కంపెనీ వారి వద్ద నుంచి అధికారులు రూ. 10లక్షలు ఒకసారి, రూ. 15లక్షలు మరోసారి, కార్మికశాఖ అధికారులు రూ. 13.40 లక్షలు చివరిసారి ఇప్పించారు. ఇతర ఇన్సూరెన్స్‌లు మాకు వచ్చాయి. ఈడీఎల్ఐ అనేది పరిశ్రమలో పనిచేసిన ఎవరికైనా చెల్లిస్తారు. దానికి నష్టపరిహారానికి సంబంధం ఉండదు. అది పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సొమ్ములు. వాటిని కూడా నష్టపరిహారంలో చూపించి మాకు అన్యాయం చేస్తున్నారు. కొందరికైతే దవాఖాన బిల్లు కలిపి నష్టపరిహారం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. రూ. కోటి పరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. కుటుంబ పెద్దను కోల్పోయాం. మాకు న్యాయం చేయాలి.
-మల్లీశ్వరి, ముత్తంగి, బాధితురాలు