నారాయణఖేడ్, మే 24: ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో కలకలం రేపింది. కనిపించకుండా పోయిన వ్యక్తి గురించి మిస్సింగ్ కేసు నమోదు కాగా, ఆ వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో సదరు వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండలం గంగాపూర్‌కు చెందిన ముత్యంరెడ్డి (35) కనిపించడం లేదని ఈనెల 16న భార్య ఫిర్యాదు మేరకు నారాయణఖేడ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భార్య సెల్‌ఫోన్‌లోని కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టగా, మనూరు మండలం ఎల్గోయికి చెందిన పండరి అనే వ్యక్తితో ఫోన్లో పలుసార్లు మాట్లాడినట్టు తేలింది. దీంతో పండరిని అదుపులోకి తీసుకుని విచారించగా, ముత్యంరెడ్డిని తానే హత్య చేసి తన వ్యవసాయ భూమిలో పూడ్చిపెట్టినట్లు పండరి అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు పండరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో భాగంగా పండరికి సహకరించిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.హత్యకేసు విచారణలో భాగంగా ఆదివారం సాయంత్రం డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం ఎల్గోయిలోని నిందితుడు పండరి వ్యవసాయ భూమిలో పూడ్చిన పెట్టిన ముత్యంరెడ్డి మృతదేహానికి మనూరు తహసీల్దార్ విష్ణుసాగర్ సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు.
వివాహేతర సంబంధమే కారణమా..
ముత్యంరెడ్డి హత్యకు గల కారణాలను పోలీసులు స్పష్టం చేయక పోయినప్పటికీ, హత్యకు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు ముత్యంరెడ్డి భార్య నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజులుగా నిందితుడు ఎల్గోయికి చెందిన పండరితో ముత్యంరెడ్డి భార్య వివాహేతర సంబంధం నెరపుతుండగా, భర్త అడ్డు తొలిగించుకునేందుకే భార్య తన ప్రియుడితో కలిసి ముత్యంరెడ్డిని హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసు విచారణలో భార్య కాల్‌డేటాను పరిశీలించడం ద్వారా ముత్యంరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లు చెప్పుకొంటున్నారు. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకేత్తించింది.