సిద్దిపేట కమాన్, డిసెంబర్ 26 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో వివిధ సంఘాలు, అసోసియేషన్ భవనాల నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీలను మంత్రి హరీశ్‌రావు అందజేశారు.
ఎలక్ట్రిక్ అసోసియేషన్ భవనానికి రూ.10 లక్షలు, ముస్లిం కమ్యూనిటీ కిచెన్ షెడ్‌కు రూ.30 లక్షలు, మెడికల్ ఏజెన్సీ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్‌కు రూ.10 లక్షలు, సంజీవని యూత్ అసోసియేషన్ భవనానికి రూ.10 లక్షలు, పద్మశాలీ భవనం కమ్యూనిటీ హాల్‌కు రూ.25 లక్షలు, పవనసుత యూత్ అసోసియేషన్ భవనానికి రూ.5 లక్షలు, కోమటి చెరువు చాకలి కమ్యూనిటీ హాల్‌కు రూ.15 లక్షలు, సర్వేశ్వర ఆలయం కార్మిక భవనానికి రూ.20 లక్షలు, చిన్నకోడూరు మండలం విఠలాపూర్, నంగునూరు మండలం దర్గపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల మత్స్యకార సొసైటీల భవనాలకు ప్రొసీడింగ్ కాపీలను మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్ వైస్‌చైర్మన్ జంగిటి కనకరాజు, రాష్ట్ర పద్మశాలీ సంఘం కన్వీనర్ బూర మల్లేశం, బీఆర్ఎస్ నాయకుడు బందారం రాజు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.