నారాయణఖేడ్, డిసెంబర్ 28: నిర్మాణంలో ఉన్న కల్వర్టుగుంత ముగ్గురు యువకుల ప్రాణాలు బలిగొంది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారు 161బీ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అవుటి నర్సింహులు(27), జిన్నా మల్లేశ్(24), జిన్నా మహేశ్ (23) కలిసి శనివారం రాత్రి నారాయణఖేడ్ నుంచి బైక్‌పై తమ స్వగ్రామమైన నర్సాపూర్‌కు బయలుదేరారు.
ఈ క్రమంలో మార్గమధ్యలో జూకల్ శివారులోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం సమీపంలో కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన గుంతలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి నారాయణఖేడ్‌కు వెళ్లిన ముగ్గురు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున వారి ఆచూకీ తెలుసుకునేందుకు నారాయణఖేడ్‌కు వస్తుండగా కల్వర్టు గుంతలో ముగ్గురు యువకులు విగతజీవులుగా పడిఉండడం గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మల్లేశ్, మహేశ్ అన్నాదమ్ములు కాగా, వీరికి నర్సింహులు బావ అవుతాడు.
ఊహించని సంఘటనతో దిగ్భ్రాంతికి లోనైన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గ్రామంలో మూడు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ సంఘటనతో నర్సాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. 161బీ జాతీయ రహదారి పనుల్లో భాగంగా కల్వర్టు నిర్మాణం పనులు చేపడుతున్నారు. నిర్మాణ స్థలంలో వాహనదారులను అప్రమత్తం చేస్తూ ఏర్పాటు చేయాల్సిన సూచిక బోర్డులు, ఇతర జాగ్రత్తలేవి చేయకపోవడం మూలంగానే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
