పటాన్చెరు, మే 17: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు ఏండ్ల తరబడి ఇక్కడే తిష్టవేసి చక్రం తిప్పుతున్నారు. రాజకీయ పలుకుబడి, జిల్లా అధికారుల ప్రోత్సాహంతో పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, గుమ్మడిదల, జిన్నారం మండలాల్లో కొందరు నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు(ఆర్ఐ) ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తూ షాడోబాస్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పటాన్చెరు నియోజకవర్గం హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతంలోని భూములు హాట్‌కేకులా మారాయి. అధికార పార్టీ నేతల మద్దతుతో పాటు జిల్లా, డివిజన్ స్థాయి అధికారుల ప్రోత్సాహంతో రెవెన్యూ శాఖలోని పలువురు నాయబ్ తహసీల్దార్లు తహసీల్ కార్యాలయాల్లో చక్రం తిప్పుతూ పనులు చక్కబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తహసీల్ కార్యాలయంలో వారు చెప్పిన మాటే శాసనంగా సాగుతున్నది. ప్రతినెలా జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు వారు భారీగా ముడుపులు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో తహసీల్దార్ల కంటే నాయబ్ తహసీల్దారులు, ఆర్ఐల హవా సాగుతున్నది. వీరి సహకారంతో ప్రభు త్వ భూముల కబ్జాలు, అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వారిదే హవా..?
పటాన్చెరు నియోజకవర్గ తహసీల్ కార్యాలయాల్లో తహసీల్దార్లు డమ్మీలుగా మారారని, నాయబ్ తహసీల్దార్లు షాడో బాస్‌లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పటాన్చెరు నియోజకవర్గం హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక్కడి భూములకు భారీగా డిమాం డ్ ఉంది. దీంతో కొందరు రియల్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో రాజకీయ నేతలకు తెలియదు.
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న నాయబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు సర్వే రికార్డులూ పరిశీలించి రాజకీయ నేతలకు జిల్లా, డివిజన్ అధికారులకు సమాచారం అందిస్తున్నారని తెలిసింది. అధికారుల సూచనలు, సలహాలు తీసుకొని ప్రభుత్వ భూముల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఇండ్ల కోసం పట్టాలు ఇచ్చినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తయారుచేసి రాత్రికి రాత్రికి నిర్మాణాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరులు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో కొందరు అధికారుల ప్రోత్సాహంతో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన వారు రాత్రి రాత్రికే ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారు. ప్రభు త్వ భూముల్లో ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వ భూములు అక్రమించిన వారు రెవెన్యూ అధికారులకు భారీగా డబ్బులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. తహసీల్దార్లు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇతర జిల్లాల నుంచి పటాన్చెరు నియోజకవర్గానికి బదిలీపై వచ్చారు. వారికి ఈ ప్రాంతంపై అంతగా అవగాహన, పట్టులేదు. దీంతో ఎప్పటి నుంచో ఇక్కడే ఏండ్లుగా తిష్టవేసిన నాయబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు పనిచేస్తూ రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు.
రాజకీయ నేతలు చెప్పినా తహసీల్దార్లు పనులు చేయకపోతే, షాడో బాస్‌లు ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయించండి అని సలహాలు ఇస్తున్నారని తెలిసింది. కొన్నేండ్లుగా ఈ ప్రాంతంలో పని చేయడంతో వారు ఆడిందే ఆట పడిందే పాటగా సాగుతున్నది. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా, వెంటనే కబ్జాదారులకు సమాచారం అందిస్తున్నారని తెలిసింది.
నియోజకవర్గంలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న అధికారులపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులకు జిల్లాస్థాయిలో పనిచేస్తున్న ఓ అధికారి అండ ఉందనే ప్రచారం సాగుతున్నది. ఆ అధికారి చెప్పిన పనులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది.
సామాన్యులకు ఇబ్బందులు
తహసీల్ కార్యాలయాల్లో పనిచేసే ఆర్ఐలు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎప్పుడూ కార్యాలయాల్లో ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు కులం, ఆదాయ ధ్రువీకరణ, ఇతరత్రా పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అధిక మొ త్తంలో డబ్బులు వసూలు చేస్తున్నా చర్యలు లేవు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తహసీల్దార్లకు ఆర్ఐలు నివేదికలు ఇవ్వాలి. కానీ, ఎక్కడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు.విద్యార్థుల నుంచి మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. ధ్రువీకరణ పత్రాల కోసం సామాన్యులు తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.