సిద్దిపేట, జూన్ 5: అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్లు మాత్రమే కాదని.. ప్రజలకు ఉపాధి కల్పించడమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్వితీయ ఎంటర్ప్రైజెస్ దుస్తుల తయారీ పరిశ్రమను శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేవలం నాలుగు రోడ్లు, బిల్డింగ్లు, కాలేజీలు, గుడులు కట్టడం లేదా కోమటిచెరువును అభివృద్ధి చేయడం మాత్రమే నిజమైన అభివృద్ధి కాదని, ప్రజలకు ఉపాధి కల్పించి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయడమే అసలైన అభివృద్ధి అన్నారు.
ఒక ప్రజాప్రతినిధిగా సిద్దిపేట మహిళలకు, గృహిణులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే తన కల ఈరోజు టెక్‌లైన్, అద్వితీయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిజమవడంపై సంతోషం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కార్పొరేట్ సూళ్లు, కాలేజీల యూనిఫామ్స్ ఆర్డర్లతో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, ఒక మహిళగా అద్భుతంగా రాణిస్తున్న టెక్‌లైన్ అధినేత్రి భువనేశ్వరి కృషిని హరీశ్ రావు అభినందించారు. ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుని, లాభాల కంటే పదిమందికి ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్లో ఈ పరిశ్రమను నెలకొల్పిన కో-ఆపరేటివ్ చైర్మన్ తోట శ్రీకాంత్ రెడ్డి, ఆయన బృందాన్ని హరీశ్‌రావు మనస్ఫూర్తిగా అభినందించారు.
ప్రస్తుతం ఇకడ 70 మంది మహిళలు పనిచేస్తున్నారని, త్వరలోనే 100 మంది స్టిచ్చింగ్, మరో 100 మంది ప్యాకింగ్ విభాగాల్లో… మొత్తంగా 200 మంది మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు.సాధారణంగా నెల రోజుల్లో నేర్చుకునే పనిని సిద్దిపేట మహిళలు తమ నైపుణ్యంతో కేవలం 4 రోజుల్లోనే నేర్చుకున్నారని భువనేశ్వరి చెప్పడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. మహిళలంతా క్రమశిక్షణతో, నాణ్యతతో పనిచేసి ఈ సంస్థకు మంచి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. పనితనం బాగుంటే భువనేశ్వరి మరిన్ని ఆర్డర్లు ఇస్తారని, తద్వారా ఈ 200 మంది ఉపాధి రేపు 400, ఆపై 800 మందికి పెరుగుతుందని అన్నారు. గతంలో సిద్దిపేటలో 6 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చినప్పటికీ, అవి కేవలం ఇండ్ల వరకు మాత్రమే పరిమితమయ్యాయని.. కానీ, కమర్షియల్ గా, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే అద్వితీయ సంస్థలో ఏర్పాటు చేసిన అధునాతన లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు ఎంతో అవసరమని హరీశ్‌రావు అన్నారు.
మహిళల శ్రమ, క్వాలిటీ ఆధారంగానే సిద్దిపేట భవిష్యత్తులో భారతదేశానికి రెండో షోలాపూర్‌గా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థను మరింత విస్తరించేందుకు వీలుగా కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలతో తాను స్వయంగా మాట్లాడి మరిన్ని ఆర్డర్లు వచ్చేలా శ్రీకాంత్ రెడ్డికి పూర్తి సహకారం అందిస్తానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. దేశంలో రూ. 60,000 కోట్ల టెక్స్ టైల్ బిజినెస్‌లో 70% స్టిచ్చింగ్ రంగానిదేనని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సంస్థను తమ సొంత సంస్థగా భావించి కష్టపడితే, సంస్థ బలపడి తద్వారా మహిళల వేతనాలు కూడా పెరుగుతాయని చెబుతూ ఉద్యోగినులకు హరీశ్‌రావు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.