నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం, సీపీఐ మద్దతు ఉండనే ఉన్నది. బయటి వాళ్లను ఎందుకు తీసుకొన్నట్టు. గతంలో కాంగ్రెస్‌ను ఇబ్బందులు పెట్టిన పోచారంను ఎట్లా పార్టీలో చేర్చుకుంటరు. అసలు ఆయన్ను ఎవరు రమ్మన్నరు. వచ్చిన పోచారానికి బుద్ధి లేకపోవచ్చు. కానీ, తీసుకున్నోళ్లకైనా బుద్ధి ఉండాలి’ అంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన పలు టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ ఎవరు? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకముందే కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేస్తడా? ఇదేమి రాజకీయమని మండిపడ్డారు.
ప్రజల్లో కాంగ్రెస్ అంటే గౌరవం పోతున్నదని, విలువలను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకొనుడు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటివి మాట్లాడటం తప్పు అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు బుద్ధి చెప్పే బదులు.. ఇట్లాంటి పద్ధతి తప్పు అని సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాలని సూచించారు. ఇట్లాంటి నిర్ణయాలపై ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ పురాలోచించుకోవాలని హితవు పలికారు. తాను గురువారం రవీంద్రభారతిలో మాట్లాడిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నానంటూ పునరుద్ఘాటించారు. తానేమీ తప్పు మాట్లాడటం లేదని, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు చెప్పినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం తాను వెనక్కి తగ్గది లేదని తేల్చి చెప్పారు.
‘ప్రభుత్వంలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయన నుంచి మొదలుపెడితే.. ఆయన మంత్రివర్గంలో గానీ, ప్రభుత్వంలో గానీ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? ఎంతమంది కాంగ్రెస్‌పార్టీ వాళ్లు ఉన్నారో? ప్రజలకు తెలుసు.. కానీ, ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అయారం, గయారం గాళ్లు వాళ్ల స్వార్థంకోసం వస్తారు గానీ.. పార్టీ బాగు కోసం కాదని హితువు పలికారు. బయటిపార్టీల నుంచి వచ్చినోళ్లు ప్రభుత్వంలో, పార్టీలో అసలు కాంగ్రెసోళ్ల మీద పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. తాను మాట్లాడిన మాటలపైనా అధిష్ఠానం ఏమీ అనడం లేదని, పార్టీ బాగుకోసం ఆలోచించే మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఉద్యమకారులను గౌరవించాలని, కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని తాను కోరుతున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్‌లో పాతతరం నేతలు తప్పుకోవాలని, రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని రాజగోపాల్‌రెడ్డి కోరారు. ఇది జెన్జీల యుగమని, యువతను ప్రోత్సహించాలని పార్టీలోని సీనియర్ నేతలకు సైతం చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేసే విధానంలో మార్పులు రావాలని, పాత పద్ధతుల్లో పనిచేస్తామంటే నడువదని సూచించారు. రాబోయే రోజుల్లో అవినీతిరహితులకే టికెట్లు ఇవ్వాలని, నిజమైన కాంగ్రెస్‌వాదులకు న్యాయం చేయాలని కోరారు. అవినీతి రహిత ప్రజాపాలన అందించాలనేదే తన అభిప్రాయమని స్పష్టం చేశారు.