టేక్మాల్, జూన్ 14: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటూ పాలకులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా సౌకర్యాలు, వసతులు ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం కంటే ముందుగానే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫామ్స్ పాఠశాలలకు చేరాలి.
ప్రారంభం రోజునే వాటిని విద్యార్థులకు అందజేయాలి. అది వాస్తవంగా కార్యరూపం దాల్చడంలేదు. టేక్మాల్ మండలంలో 36 ప్రాథమిక, ఆరు ప్రాథమికోన్నత, ఏడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు కేజీబీవీ, మోడల్, గిరిజన ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. మండలంలోని అన్ని పాఠశాలల్లో కలిపి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 4432 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో 170 మంది చిన్నారులు కొత్తగా పాఠశాలలో చేరారు.
అన్ని తరగతుల విద్యార్థులకు 21,052 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా నేటి వరకు 18,804 మాత్రమే వచ్చాయి. 24వేల నోటు పుస్తకాలు మండలానికి చేరాయి. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్ అందజేయాల్సి ఉంది. అన్ని పాఠశాలల విద్యార్థులకు ఒక్కో జత అందించినట్లుగా రికార్డులో చూపుతున్నారు. వాస్తవానికి చాలా పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్స్ అందలేదు. ఇప్పటికైనా విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.