సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 1: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గం, కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డు రంగధాంపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ పిలుపునిచ్చారని, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని, సిద్ధాంతాలను విద్యావంతులు ప్రజలకు బోధించాలని సూచించారు. అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచక పోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు.
నాడు కేసీఆర్ దళితబంధు కార్యక్రమం ప్రారంభిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి 14 నెలలు అయినా ఉలుకూ పలుకూ లేదన్నారు. కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆయన స్ఫూర్తి తెలియాలని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. కానీ, నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఆ అంబేద్కర్‌ను దర్శించుకోకుండా దానికి తాళాలు వేశారని విమర్శించారు. ఏడాది నుంచి కనీసం అక్కడ దుమ్ము దులిపే పరిస్థితి లేదన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర, అంబేద్కర్ స్టడీ సెంటర్ లాంటివి కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేయిస్తే..దాన్ని ఎవరూ చూడకుండా తాళాలు వేసిన చరిత్ర నేటి ప్రభుత్వానిది అని విమర్శించారు.
ఇప్పటికైనా భేషజాలకు పోకుండా వెంటనే అందరూ చూసేలా అనుమతించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు అమెరికా లాంటి దేశాలకు వెళ్లి పైచదువులు చదివారని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వకుండా పేద పిల్లలకు అన్యాయం చేస్తున్నదన్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన పథకాలను కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఒక్క అంబేద్కర్ విగ్రహం లేని ఊరు ఉండకూడదని, ఎక్కడైనా లేకపోతే తాను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తానని గతంలో చెప్పానని, ఇప్పుడు దాదాపు 99 శాతం పూర్తయిందని, ఇంకా కొత్త గ్రామపంచాయతీల్లో అంబేద్కర్ విగ్రహాలను పెట్టిస్తామన్నారు.
విగ్రహాలు పెట్టడమే కాకుండా అంబేద్కర్ జయంతి, వర్ధంతిలను నిర్వహించి ఆయన ఆశయాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో కొత్తపల్లి-మనోహరాబాద్‌కు ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ వంగ నాగిరెడ్డి, కౌన్సిలర్ వంగ రేణుకాతిరుమల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దబ్బెట చందు, శ్రీనివాస్, రాజు, నాయకులు కనకయ్య, ఐల య్య, భాను, కనకరాజు, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.