సిద్దిపేట, ఫిబ్రవరి 17 : క్రీడలైనా, రాజకీయాల్లో అయినా ఓటమి గెలుపునకు నాంది అని, తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మరో ఇరవై ఏండ్లు వరుసగా అధికారంలో ఉండడం ఖాయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కేసీఆర్ ట్రోఫీ క్రికెట్, వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు సోమవారం రాత్రి ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇప్పుడు ప్రజలంతా మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
కేసీఆర్ పాలనే నయముండే అని అన్నివర్గాల ప్రజలు గుర్తుచేస్తున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ వైపే ఉంటామని ప్రజలు ముక్తకంఠంతో పేర్కొంటున్నా రని చెప్పారు. కేసీఆర్ ఆల్ రౌండర్ అని, సాధించిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపారని హరీశ్‌రావు గుర్తుచేశారు. 20-20 మ్యాచ్‌లు ఆడుతానని సీఎం రేవంత్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్‌వి మ్యాచ్‌లు అన్ని తొండివి అని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.2500, తులం బంగారం, పెన్షన్లు, 6 గ్యారెంటీలు ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు. అభివృద్ధి ఆగిందని, రియల్ ఎస్టేట్ కుంటుపడిందని, ఆటోవాలాల జీవితాలు ఆగమైనట్లు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చినవి 6 వేల ఉద్యోగాలు… చెప్పినవి 2 లక్షల ఉద్యోగాలు అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ గ్రాఫ్ పెంచితే రేవంత్ ఆ గ్రాఫ్‌ను పడిపోయేలా చేశాడన్నారు. 6 నెలల నుంచి రేవంత్‌రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లకుండా పోలీసులను చుట్టూ పెట్టుకొని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉంటూ పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలోని భద్రాచలం ప్రాంతానికి త్రిష మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో సత్తాచాటిందని, సిద్దిపేట క్రీడాకారులు సైతం జాతీయస్థాయిలో రాణించాలన్నదే తన తపన అని హరీశ్‌రావు అన్నారు. క్రీడాకారులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కాం గ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి సిద్దిపేటలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదన్నారు.
ఈ ప్రాం తంలో మంజూరైన వెటర్నరీ కళాశాలను సైతం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌కు తరలించుకుపోయాడని విమర్శించారు. కేసీఆర్ అంటే ఒక శక్తి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. అనంతరం విజేత జట్లకు హరీశ్‌రావు నగదు బహుమతులు అందజేశారు. కేసీఆర్ బర్త్‌డే కేకు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ ర వీందర్ రెడ్డి, నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, రజనీకాంత్ రెడ్డి, చందర్రావు, భూమయ్యగారి కిషన్ రెడ్డి, ఎద్దు యాదగిరి, క్రీడాకారులు పాల్గొన్నారు.