మెదక్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వనరులు దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా, పార్టీ జెండాలను ఆమె ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడేందుకు మరో ఉద్యమం చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులు, ఆంధ్ర పాలకులు పార్టీల పేరుతో కాంగ్రెస్ సర్కార్‌తో కలిసి వనరులు దోపిడీ చేసేందుకు కుట్ర చేస్తున్నారని, వారికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. అమరవీరుల త్యాగాలు, తెలంగాణ సబ్బండ వర్గాల పోరాటంతో 60 ఏండ్ల కల సాకారమైందన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 14 ఏండ్లు పోరాటం చేశారని, ఎంతోమంది యువకులు, తెలంగాణ వాదులు త్యాగాలు చేశారన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేసేందుకు విద్యుత్‌శాఖలో సంస్కరణలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతో కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ నీరు సరఫరా చేశారన్నారు. సింగూర్ నీటి కోసం రైతులు మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటే మెదక్ కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే రోహిత్‌రావు హాజరు కాలేదని, మంత్రి వివేక్ మాత్రమే హాజరయ్యారన్నారు.
కేసీఆర్ పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్ల పోరాటం చేసిన ప్రాణత్యాగం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని గుర్తుచేశారు. ఎంతోమంది యువకులు, విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారన్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేశారన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం చేయడంతో సాగు, తాగునీటి సమస్యలు వచ్చాయన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన పోరాటం చేశారన్నారు. మెదక్ మాజీ మున్సిపాల్ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు, నాయకులు లావణ్యరెడ్డి, సుప్రభాతరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.