సిద్దిపేట, నవంబర్ 2: జాతీయస్థాయి పుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరపున ఆడుతున్న సిద్దిపేట జిల్లా క్రీడాకారుడు ఆనస్ సత్తా చాటుతున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరుగుతున్న నేషనల్ సబ్ జూనియర్ అండర్- 13 టోర్నీలో ఆనస్ అద్భుతమైన ప్రదర్శన చేసి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ టీం సెలక్షన్లో తెలంగాణ వ్యాప్తంగా 600 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎంపికలకు హాజరయ్యారు.
వారందరినీ వెనకి నెట్టి ఆనస్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన సబ్ జూనియర్ టోర్నీ లో ప్రతి మ్యాచ్‌లో తనదైన శైలిలో గోల్స్ చేస్తూ సత్తాచాటాడు. టోర్నీలోని మొదటి మ్యాచ్ ఉత్తరాఖండ్‌తో జరుగగా ఆనస్ మొదటి గోల్ చేశాడు. రెండో మ్యాచ్ జమ్ముకశ్మీర్‌తో జరుగగా, అందులో కూడా ఆనస్ గోల్ చేశాడు.సెమీ ఫైనల్లో మేఘాలయ టీంతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో చివరి నిమిషంలో ఆనస్ గోల్ చేయడంతో తెలంగాణ టీం ఫైనల్లో ప్రవేశించింది. దీంతో జాతీయ సెలెక్టర్స్ దృష్టిలో పడ్డాడు.
ఆనస్ను తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పాల్గుణ అభినందించారు.. ఆనస్ పుట్‌బాల్ కోచ్ అక్బర్ నవాబ్ మాట్లాడుతూ.. సిద్దిపేట నుంచి ఆనస్ జాతీయస్థాయి కి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశం పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట డీవైఎస్వో వెంకట నర్సయ్య,సిద్దిపేట ఫుట్‌బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సాజిద్, కార్యవర్గ సభ్యులు హరీశ్, లక్ష్మీనారాయణరెడ్డి ఆనస్కు అభినందనలు తెలిపారు.