సిద్దిపేట అర్బన్, జూన్ 2 : ఎందరో అమరుల త్యాగా ల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దశదిశలా విరాజిల్లుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వంద నం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పడానికి గర్వపడుతున్నానని తెలిపారు. తెలంగాణ అనేది ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదని.. తెలంగాణ అంటే ఒక అస్తిత్వ పోరాట రూపమన్నారు. తెలంగాణలో ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యం కలిగి ఉండి.. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ లాంటి భాషలు మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వంగా దేశంలో ఒక విశిష్టతను కలిగి ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అన్నివర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు పాల్గొన్నారని, బలిదానాల ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు దశాబ్దాల కల నెరవేరిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిద్దిపేట జిల్లా ప్రజలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అనాదిగా కవులకు, మేధావులకు నిలయం సిద్దిపేట అన్నారు. జిల్లాలో సాంస్కృతిక, సాహిత్య చైతన్యం ఎక్కువ అని, ఆ ప్రభావంతో సిద్దిపేట జిల్లా ప్రజలు తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో నాయకత్వం వహించి రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారని కలెక్టర్ గుర్తుచేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ, సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి.అనురాధ, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.