సిద్దిపేట, ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్‌ను యువత ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో జాతీయస్థాయికి ఎంపికై సత్తాచాటాలని, క్రికెట్ అంటే మెట్రో నగరాలకే పరిమితం కాదని, మన ప్రాంతంలో సైతం అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారని నిరూపించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని జయశంకర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ కప్ సీజన్-3 టోర్నీని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, న్యాచురల్ స్టార్ నానితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ వేదికపై నాని నూతన సినిమా దసరా ట్రైలర్‌ను మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు రాయుడు, నాని, హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్తో కలిసి మంత్రి క్రికెట్ ఆడారు. టోర్నీలో క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిక్స్ కొట్టిన వారికి రూ.వెయ్యిచొప్పున అందజేయాలని హీరో నాని చెక్‌ను ఆందించారు. కేక్‌ను కట్ చేసి సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రారంభించారు.
అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు
సీఎం కేసీఆర్ కప్ సీజన్-3 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మైదానం నలువైపులా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, అంబటి రాయుడు, నాని కటౌట్లు ఆకట్టుకున్నాయి. నినాదాలతో స్టేడియం హోరెత్తింది. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, నిర్వాహకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్, సీనియర్ నాయకులు రాధాకృష్ణశర్మ, పాలసాయిరాం, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.