మెదక్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. కర్ణాటకలో కరెంటు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాగా అవతరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అన్ని రకాల విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. విద్యుత్ వినియోగం సైతం పెరుగుతూనే ఉంది. అయినా నిరంతర విద్యుత్‌కు మాత్రం క్షణం కూడా అంతరాయం ఉండడం లేదు. దీంతోపాటు గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యలు లేకుండా వేలాది ట్రాన్స్ఫార్మర్లను, పదుల సంఖ్యలో 33/11 కేవీ, 132/11 కేవీ సబ్స్టేషన్లు, వేలాది విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో దాదాపు లక్ష వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిసున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ అనుకూల విధానాలతో ఎనిమిదేండ్లలో వ్యవసాయ రంగం స్వరూపమే మారిపోయింది. సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లో విద్యుత్‌పై సమీక్షించి రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంటును అందుబాటులోకి తెచ్చారు. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 2014లో అతి తక్కువ వ్యవసాయ విద్యుత్ సర్వీస్‌లు ఉండగా, ఇప్పుడు లక్షల్లో వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో విజయవంతం.. రాష్ట్రమంతటా అమలు…
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు కోసం మెదక్ జిల్లాలోనే ప్రయోగాత్మకంగా అమలు చేసి సాంకేతిక సమస్యలను పరిశీలించారు. జిల్లాలో విజయవంతం కావడంతోనే రాష్ట్రమంతటా అమలైంది. తెలంగాణ రాష్ట్రం అంతటా 2017 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి 24 గంటల ఉచిత కరెంటు అమలులోకి వస్తే.. మెదక్ జిల్లాలో 2018 జనవరి 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మెదక్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు 1,02,316 ఉండగా, 2018 కంటే ముందు 89,479 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే 2018 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు 12,837 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరిగాయి. అలాగే 2018 కంటే ముందు 19,761 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, 2018 నుంచి డిసెంబర్ 2022 వరకు 4,249 కొత్త ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. దీంతో డిసెంబర్ 2022 నాటికి 24,010 ట్రాన్స్ఫార్మర్లు జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే లక్షల్లో విద్యుత్ స్తంభాలను వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వంగిపోయిన, తుప్పుపట్టిన స్తంభాలను తొలిగించి కొత్త వాటిని అమర్చారు.
కరెంట్ సమస్యలు తీరాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ సమస్యలు తీరాయి. నేను పౌల్ట్రీఫామ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. 24 గంటల విద్యుత్‌తో కోళ్లకు నీరు, వెలుతురు సరిగ్గా అందించగలుగుతున్నాను. విద్యుత్‌తో బోర్ నడిపించడం, బల్బులు వేయడం, బ్లూడింగ్, స్పింగ్లర్ తదితర వాటికి ఉపయోగిస్తున్నాం. గతంలో త్రీపేస్ కరెంట్ ఉండేది, అది కూడా రోజుకి 5 గంటలు మాత్రమే ఇచ్చేవారు. ఆ కరెంట్ కోసం రోజంతా ఎదురుచూసేటోళ్లం. కోళ్లకు సరిగ్గా నీరు అందక అప్పట్లో మృతి చెందేవి. కానీ, నేడు కరెంట్ సక్రమంగా ఉండడంతో ఆదాయం రెట్టింపుఅయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఫౌల్ట్రీ రంగం అన్ని విధాలా బాగుపడుతుంది. విద్యుత్ సరిగ్గా లేక పొరుగు రాష్ట్రాల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అలాంటి పరిస్థితిని అధిగమించి మన రాష్ట్రంలో వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి.
– శ్రీనివాస్ గౌడ్, బ్రాహ్మణపల్లి, నర్సాపూర్
జనరేటర్ల బాధ తప్పింది
కేసీఆర్ సార్ ఉండబటికే మాకు జనరేటర్ల బాధ తప్పింది. లేకుంటే మేము చేసిన పైసలు డీజిల్‌కే పోయేటివి. వెల్డింగ్ దుకాణానికి కచ్చితంగా 24 గంటల కరంట్ ఉండాలె. లేకుంటే పని నడవదు. వర్కర్లకు జీతాలియ్యాలంటే పని నడువాలే. కరెంట్ ఉంటేనే నడుస్తది. మేము బతుకుతం. మాతోపాటు మా దగ్గర పనిచేసే లేబర్ కూడా బతుకుతారు. అందుకే మేము కేసీఆర్ సార్నే కోరుకుంటున్నం. మా బతుకులకు పెద్ద దిక్కు కేసీఆర్ సారే.
– ఎండీ. మోయిజుద్దీన్, వెల్డింగ్ షాప్ యజమాని, రామాయంపేట
తెలంగాణ సర్కారు వచ్చినంక కరెంటు తిప్పలు పోయినై..
ఎప్పుడు సీఎంగా కేసీఆర్ ప్రభుత్వమే ఉండాలి. పదేండ్ల కిందట రెండు,మూడు సార్లు గిట్లనే చాయి, కూల్ డ్రింక్ దుకాణం పెట్టినం. అయితే అప్పుడు కరెంటు గంటల తరబడి తీసెటోళ్లు. దాని వల్ల కూల్‌డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు కరాబైతుండే. దీంతో మస్తు లాస్ అయినం. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ సర్కారు వచ్చినంక కరెంటు తిప్పలు పోయినై. గిప్పుడు 24 గంటలు కరెంటు మస్తుగ ఉంటున్నది. దీని వల్ల కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీం, పాల ప్యాకెట్లు, ఎప్పడు చూసినా కూల్ ఉంటున్నయి. వ్యాపారం కూడా బాగా నడుస్తున్నది.
– గోబుల మైపాల్, రిలాక్స్ టీస్టాల్, నిజాంపేట, నారాయణఖేడ్
మేము బతకాలంటే కేసీఆర్ సారే ఉండాలి
ఇప్పుడు 24 గంటల కరెంట్‌తో మంచిగ బతుకుతున్నం. కేసీఆర్ సార్ దయ వల్ల మాకు కరెంట్ మంచిగ ఉంటుంది. 24గంటల్లో ఒక్క నిమిషం కూడా పోతలేదు. కాగ్రెసొళ్లు వస్తే ఉన్న కరెంట్‌ను గూడా ఉంచరు. అబ్బో వాళ్లు రాకుండా మేము కూడా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సార్కే ప్రచారం చేస్తం. ఇయ్యాల మాకు కరెంట్ బాధ తప్పింది. హాయిగా పిల్లాపాపలతో బతుకుతున్నం.
– బత్తుల సుదర్శన్, లేట్మిషన్ వర్కర్, రామాయంపేట