-11 భాషల్లో పుస్తకాలు లభ్యం
– నిరుద్యోగులకు సదావకాశం
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు ఓ మహాకవి. పుస్తకాలు చదవడంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. చదవాలనే తపన ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొనలేని వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారంతా గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుందామంటే అవరసమైన పుస్తకాలు దొరకని పరిస్థితి. అయితే ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండి చదువుకునే అవకాశం వస్తే అది నిజంగా శుభవార్తే. ఇదంతా ఈ-గ్రంథాలయంతో సాధ్యమవుతుంది.
మెదక్ మున్సిపాలిటీ, మే 9: భారీస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం సర్కారు కొలువులు భర్తీ చేయనుండడంతో ఉద్యోగార్థులు గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాల బాట పడుతున్నారు. చాలా రోజుల తరువాత సుమారు 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తుండటంతో ఈసారి పోటీ తీవ్రంగా ఉండనున్నది. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఇక అభ్యర్థులు కావాల్సిన పుస్తకాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.
ఆడియో, వీడియో కథనాలు..
ఈ-గ్రంథాలయంలో ఒకటి కాదు, రెండుకాదు లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఖరగ్పూర్ ఐఐటీ సహకారంతో ‘డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ పేరుతో వెబ్సైట్ను రూపొందించారు. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచింది. ఆడియో, వీడియో కథనాలున్నాయి. వ్యవసాయం, కంప్యూటర్ సైన్స్, ఐటీ, జనరల్ ఫిలాసాఫీ, సైకాలజీ అంశాలకు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఎందరో మహానుబావులు రాసిన లక్షల పుస్తకాలు ఇందులో దొరుకుతాయి. అందరికీ వారి అభిరుచికి తగినవి లభిస్తాయి. ఇంట్లో కంప్యూటర్ లేకపోతే సెల్ఫోన్లో ఇష్టమైన, అవసరమైన వాటిని ఎప్పుడైన ఆనందంగా చదువుకోవచ్చు. సెల్ ఫోన్లో ‘నేషనల్ డిజిటల్ లైబ్రేరీ ఆఫ్ ఇండియా’
యాప్ డౌన్లోడ్ చేసుకుంటే లక్షల పుస్తకాలు చేతిలో ఉన్నట్టే. ఈ లైబ్రేరిలో 11 భాషల్లో పుస్తకాలు లభ్యమవుతాయి
ఎలా చదవలాంటే..
ఆన్లైన్లోని గూగుల్లోకి వెళ్లి ‘నేషనల్ డిజిటల్ లైబ్రేరీ ఆఫ్ ఇండియా’లో లాగిన్ అవ్వాలి. తెరపై వచ్చిన పుస్తకాలను క్షణ్ణంగా చూసుకుని పర్సనల్లో నమోదు చేసుకోవాలి. ఇందులో ఈ-మెయిల్ చిరునామా, పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. ఒకసారి న మోదు చేసుకుంటే ఎప్పుడైనా లాగిన్ అయి కావాల్సి పుస్తకాలు చదువుకోవచ్చు. ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ను వీక్షించొచ్చు. అవసరమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.