నర్సాపూర్, జూలై 10: సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడిబాట నిర్వహిస్తున్నది. దీంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తున్నది. అంతా బాగున్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పాఠశాలల్లో అక్షయపాత్ర వారు పెట్టే భోజనం విద్యార్థులకు నచ్చడం లేదు. దీంతో వారు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ఇది నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో నిత్యం జరుగుతున్న తంతు. ఈ పాఠశాలలో 283 మంది విద్యార్థులు, 13 మంది ఉపాధ్యాయులున్నారు.
మొదట్లో వంటలు బాగానే ఉండేవి. మెనూ ప్రకారం భోజనం అందించారు. రానురాను పరిస్థితి దారుణంగా మారింది. వారు తీసుకొచ్చే అన్నం మెత్తగా, గడ్డలు కట్టి, పలుకుగా ఉండడంతో విద్యార్థులు తినలేక సగం ఆకలితో అలుమటిస్తున్నారు. కూరగాయలు పెట్టకుండా రోజూ సాంబర్, పప్పు పెడుతుండడంతో తినలేని దుస్థితి. ప్రభుత్వ మెనూ ప్రకారం ప్రతిరోజూ ఆకుకూర, పప్పు లేదా సాంబర్, స్నాక్స్ అక్షయపాత్ర వారు అందజేయాలి. కానీ వాటన్నింటికీ మంగళం పాడి, కేవలం పప్పు, సాంబర్తోనే సరిపెడుతున్నారు. అక్షయపాత్ర వారు పెట్టే మధ్యాహ్న భోజనం నచ్చక 90శాతం మంది విద్యార్థులు టిఫిన్ బాక్సులను ఇంటి నుంచి తెచ్చుకొని తింటున్నారు. కొంతమంది విద్యార్థుల ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేక టిఫిన్ బాక్సు తెచ్చుకోలేక ఆకలి తీర్చుకోడానికి అక్షయపాత్ర వారు పెట్టే భోజనాన్ని తింటూ సర్దుకుంటున్నారు. ఈ పరిస్థితి కేవలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు గొల్లపల్లి, లింగాపూర్, అచ్చంపేట్, నారాయణపూర్, తుజాల్పూర్, తిర్మలాపూర్, గిరిజన తండాల నుంచి విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. గతంలో గ్రామానికి చెందిన మహిళలు వంట చేసి, విద్యార్థులకు పెట్టేవారు. కానీ ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోక పాఠశాలలో వండడం మానేశారు. పాఠశాల సిబ్బంది కోరిక మేరకు అక్షయపాత్ర వారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.
విద్యార్థుల హాజరుశాతం ప్రకారం అక్షయపాత్ర వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నది. కానీ పాఠశాలలో విద్యార్థులు భోజనం చేయకున్నా వారు డబ్బులు మాత్రం దండుకుంటున్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులను అడగ్గా విద్యార్థులు తినలేక పోతున్నారని, వంటలు రుచిగా లేవని, అన్నం సరిగ్గా ఉడకడం లేదని చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా భోజనం విషయంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నాని వాపోయారు.
ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోకే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూ.5.45, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.8.17 ఒక్కో విద్యార్థి చొప్పున అక్షయపాత్ర అందిస్తున్నది. డబ్బులు సరిపోకే విద్యార్థులకు మెనూ సక్రమంగా అందించడం లేదు. ప్రభుత్వం మెనూ అమౌంట్ పెంచితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తారని స్థానికులు పేర్కొంటున్నారు.
పలుకు అన్నం, సరిగ్గా ఉడకని అన్నం , మెత్తగా ఉన్న అన్నం పెడితే ఎట్లా తినాలి. అందుకే ఇంటి నుంచి టిఫిన్ బాక్సు తెచ్చుకుంటున్నా. అక్షయపాత్ర నుంచి వచ్చే భోజ నం మంచిగ ఉండడం లేదు. వారు తెచ్చే భోజనం తినలేకపోతున్నం. అధికారులు పట్టించుకుని మంచి భోజనం అందించాలి.
– సారిక, విద్యార్థిని, పదో తరగతి
స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కుక్కలు కూడా తినవు. అంత మంచిగా ఉండదు. అన్నం బాగా లేక ఇంటి నుంచే టిఫిన్ తెచ్చుకుంటున్నా. కూర కూడా నీళ్లలాగా ఉంటది. అన్నం సరిగ్గా ఉడడం లేదు. తింటే కడుపు నొస్తున్నది. అధికారులు పట్టించుకుని మంచి భోజనం అందించాలి.
– సాయితేజ, విద్యార్థి, పదో తరగతి
ప్రభుత్వం నుంచి క్వాలిటీ బియ్యం రాకపోవడంతోనే అన్నం సరిగ్గా ఉడకడం లేదు. గతంలో కూడా చాలా ఫిర్యాదులు వచ్చా యి. ప్రస్తుతం నిబంధనలు మార్చారు. అవ న్నీ సెట్ అయ్యేవరకు సమయం పడుతుం ది. సివిల్ సప్లయ్ నుంచి వచ్చే బియ్యాన్నే విద్యార్థులకు వడ్డిస్తున్నాం. పెద్దచింతకుంట గ్రామానికి కలెక్టర్ వచ్చినప్పుడు అక్కడికి నేను వెళ్లాను. అక్కడ కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెత్తగా ఉందని నన్ను అడగారు. ప్రభుత్వం అందించే బియ్యాన్నే మేము వండిస్తున్నామని చెప్పడంతో క్వాలిటీ చెక్ చేయాలని చెప్పారు. క్వాలిటీ చెక్ చేసినా రైస్ ఇలానే ఉంటుందని చెప్పాం. దీనిపై డీసీఎస్వోతో మాట్లాడతానని కలెక్టర్ చెప్పారు. పాఠశాలను విజిట్ చేసినప్పుడు మెనూ పాటించడం లేదని కేవలం అన్నం, పప్పు మాత్రమే ఉన్నాయని ప్రశ్నించగా మా దృష్టికి రాలేదని, మేనేజ్మెంట్తో మాట్లాడతానని అన్నారు.
-సంగప్ప, అక్షయ పాత్ర పీఆర్వో