మెదక్/ సంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాల పోరాటం.. ఎన్నో ఉద్యమాలు.. ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు నిదర్శనం. ఈ నేలతల్లి నెత్తుటి త్యాగాల ప్రతిరూపం. అన్యాయంపై మట్టిబిడ్డలు చేసే తిరుగుబాటు భావజాల చిహ్నం. పోరాటాల ఉత్ప్రేరకం. ఎన్నటికీ మూగబోని ధిక్కార స్వరం. వందలాది మంది త్యాగాల ఫలం.. తెలంగాణ స్వరాష్ట్రం. స్వపరిపాలన చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు అమరుల ఆశయాలను ఆచరణలో పెడుతూనే మరోవైపు త్యాగధనుల కుటుంబాలను అక్కున చేర్చుకొంటున్నారు. ఎప్పటికప్పుడు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మెదక్ జిల్లా పోరాటాల ఖిల్లాగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్‌లోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఎందరో మహానుభావులు ఉద్యమంలో పాల్గొని అసువులుబాశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 64 మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసువులుబాశారు. అమరుల కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించారు సీఎం కేసీఆర్.
చిన్నశంకరంపేటలో అమరవీరుల స్తూపం..
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరుల జ్ఞాపకార్థం స్థూపం ఏర్పాటు చేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరుల స్తూపం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పిస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జూన్ 2న అమరవీరుల కుటుంబాలకు పూలమాలలు, శాలువాలతో జిల్లా యంత్రాంగం సన్మానిస్తోంది. వారిని స్మరిస్తోంది.
ఆత్మబలిదానంతోనైనా.. తెలంగాణ సిద్ధించాలని
టేక్మాల్, జూన్ 21: తన ఆత్మబలిదానంతోనైనా తెలంగాణ సిద్ధిస్తుందని ఓ నిర్ణయానికి వచ్చాడు కాదులూరు గ్రామానికి చెందిన కేతావత్ సూర్యనాయక్ అనుకున్నదే తడువుగా ఆత్మార్పణ చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే ..కాదులూరు గ్రామానికి చెందిన కేతావత్ సూర్య నాయక్ తెలంగాణ ఉద్యమంలో శక్తి వంచన లేకుండా పోరాడాడు. తాను చనిపోతేనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని నమ్మి ఆత్మబలిదానం చేసుకున్నాడు. సూర్యనాయక్ తల్లిదండ్రులు మోతీలాల్, తమ్మిబాయి. వీరికి సూర్యనాయక్ పెద్ద కుమారుడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవారు. సూర్యనాయక్ కళాశాలస్థాయి నుంచే రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆకర్షితుడై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తాను చనిపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని 2008లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు రూ.10లక్షలు, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అన్న సూర్యనాయక్ చేసిన త్యాగ ఫలితానికి తమ్ముడు కేతావత్ నారాయణకు ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. పెద్ద కొడుకు చేసిన త్యాగానికి ప్రభుత్వం సూర్యనాయక్ కుటుంబానికి ఆసరాగా నిలబడింది. మా కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తల్లి తమ్మిబాయి అన్నారు.
అమరుడి కుటుంబానికి ప్రభుత్వం అండ
అమీన్పూర్, జూన్ 21: తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుడి కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చాకలి నాగరాజు తెలంగాణ ఉద్యమంలో 2010 ఫిబ్రవరి 3వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఈక్రమంలో నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. అతడికి ఒక సోదరుడు, ఒక సోదరి ఉండగా.. సోదరుడు శంకర్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలను అందజేసింది. కాగా శంకర్ ప్రస్తుతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలపరిధిలోని ఫింగాటెన్ గ్రామంలో పశువుల దవాఖాన ఆఫీస్ సబార్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
మెదక్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం వాడి గ్రామానికి చెందిన ఈర్ల జైపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసి ఉద్యమానికి ఊపిరి పోశాడు. సీమాంధ్ర పాలకుల కుట్రతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తుందో రాదోనన్న బెంగ పెట్టుకొని 2011 మార్చి 14న మెదక్ పట్టణంలోని చిల్డ్రన్స్ పార్కులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 1986లో కడపలో అన్నమలై యూనివర్సిటీలో పీజీ చేసిన ఆయన ఉద్యోగం లేక రైసుమిల్లులో చేరి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంత చదివినా కూడా ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే బెంగతో నిత్యం బాధపడేవాడు. తెలంగాణ కోసం చేసిన ఉద్యమాల్లో, ధర్నాలు, రాస్తారోకోతో పాటు 2011లో నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో పాల్గొన్నాడు. అనంతరం నిజామాబాద్ జిల్లా పిట్లంలో మార్చి 13న జరిగిన గద్దర్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ కోసం జరుగుతున్న అన్యాయాన్ని జయపాల్‌రెడ్డి నిత్యం ఎండగడుతూ రందితో ఉండేవాడు. మన తెలంగాణలో ఉన్న వనరులు మనకు దక్కకుండా పరాయి పాలనలో అన్ని రంగాల్లో నష్టపోతున్నామని పదేపదే బాధపడేవాడు. అప్పట్లోనే జయపాల్‌రెడ్డి ఆత్మహత్యతో తెలంగాణ ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగసిపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడంతో పాటు జూన్ 2న అమరుడు జయపాల్‌రెడ్డి కూతురు ప్రవళికకు ఐసీడీఎస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు.
ఉద్యోగం ఇచ్చిన సీఎంకు రుణపడి ఉంటాం…
మా నాన్న చనిపోవడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. మేము ఇద్దరు అక్కాచెల్లెండ్లం. నాన్న త్యాగం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. మా అమ్మను అన్ని విధాలా చూసుకుంటున్నా. ఎంబీఏ, ఎమ్మెస్సీ చదివిన నాకు 2016లో ఐసీడీఎస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కృషితో ప్రస్తుతం మా కుటుంబం చల్లగా ఉంది. ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. తెలంగాణ అమరవీరులను గుర్తించిన సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
– ప్రవళిక (అమరుడు జయపాల్‌రెడ్డి కూతురు)
రూ.10 లక్షలు వచ్చినయ్.. బిడ్డకు ఉద్యోగం వచ్చింది..
నా భర్త చేసిన త్యాగఫలాన్ని గుర్తించి రూ.10లక్షలు ఇవ్వడంతో పాటు నా కూతురుకు ఉద్యోగం ఇచ్చిండ్రు సీఎం కేసీఆర్ సారు. కూతురుకు ఉద్యోగం ఇవ్వడంతో నా భర్త చేసిన త్యాగాల ఫలితాలతో మా కుటుంబం ప్రస్తుతం చల్లగా ఉంది. మా భర్త కన్న కలలను సాకారం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుండ్రు. ఆయన చేస్తున్న అభివృద్ధితో తెలంగాణ బాగుపడుతున్నది.
– విజయలక్ష్మి, అమరుడు జయపాల్‌రెడ్డి భార్య
అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు…
రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుంది. జిల్లాలో మొత్తం 12మందిని తెలంగాణ అమరులుగా ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా సముచితస్థానాన్ని కల్పించింది. అమరులకుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలని సరారు ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో 12 ఉద్యోగాలు కల్పించింది. జిల్లాలో మొత్తం 12మంది తెలంగాణ అమరులుగా గుర్తించారు. ఒద్ది శ్రీనివాస్ (రామాయంపేట), ప్రవీణ్‌కుమార్ గౌడ్(జాన్సిలింగాపూర్), చాకలి నరేశ్(శమ్నాపూర్), జంగం రమేశ్(రాజిపేట్), ఈర్ల జయపాల్‌రెడ్డి(వాడి), బాల్‌రెడ్డి(కర్నాల్‌పల్లి), మ్యాదరి నరేశ్(కొల్చారం), నునావత్ గణేశ్(కొల్చారం), నరేందర్‌రెడ్డి(పోతాన్‌పల్లి), పిట్ల ముత్యం( జప్తి శివనూర్), యాదగిరి( ముస్లాపూర్), సురేశ్‌నాయక్(టేక్మాల్) గుర్తించారు. అమరులకుటుంబసభ్యులకు ఉద్యోగాలను కల్పించింది. అంతేకాకుండా రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందించి సరారు తమ బాధ్యతను నెరవేర్చింది.
ప్రజల కలసాకారమై పదేండ్లు
60 ఏండ్ల తెలంగాణ ప్రజల కల సాకారమై పదేండ్లు కావొస్తోంది. ఉధృతమైన పోరాటాలు, అరెస్టులు, నిర్బంధాలు, ఆత్మబలిదానాలు త్యాగఫలాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. మెదక్ జిల్లాలో జరిగిన ఉద్యమానికి ఊపిరిలూది వేదికగా మారింది. తెలంగాణ ఉద్యమం సమయంలో మెదక్ జిల్లా నుంచి పెద్దఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ రాదేమోనన్న బెంగతో కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొంత మంది తెలంగాణ ఉద్యమంలోనే బలయ్యారు. 2001లో బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమాలు కొనసాగినా ఉధృతంగా సాగింది మాత్రం 2009లోనే. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్షతోనే అని చెప్పుకోవాలి. ఆ సమయంలో కేంద్రం తెలంగాణ ప్రకటించి వెనుకడుగు వేయడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏకతాటిపైకి వచ్చి ఉప్పెనలా కదంతొకాయి. అందుకు సకలజనుల సమ్మెను అస్త్రంగా ఎంచుకున్నాయి. దీంతో 2011 సెప్టెంబర్ 13వ తేదీన సకలజనుల సమ్మెకు మెదక్ జిల్లా వేదికైంది. ఏకంగా 42రోజులపాటు సమ్మె చేయడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలన స్థంబించిపోయింది. మెదక్ జిల్లాలో ఉద్యమ వాతావరణం సంతరించుకుంది. ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెలో కూర్చోవడంతో వారికి సంఘీభావం తెలిపేందుకు జిల్లాలోని ప్రతి పల్లె, పట్టణ ప్రజలు తరలివచ్చారు. సకల జనుల సమ్మె.. సబ్బండవర్గాల మద్దతుతో ఉధృతంగా సాగింది. 42రోజుల సమ్మెలో రోజూ జిల్లా కేంద్రం మెదక్‌లో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకోరోజు ఒకో శాఖ తరఫున ఉద్యోగులు వంట చేసి భోజనాన్ని పెట్టారు. మధ్యాహ్న భోజనం అకడే వండడంతో ఉద్యోగ సంఘాలనేతలతోపాటు వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన వందలాది మంది ఉద్యమకారులు, ప్రజలు అకడే తినేవారు.
నేడు జడ్పీ సమావేశం
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 21: అమరవీరుల సంస్మరణ దినత్సోవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు జడ్పీ సీఈవో వెంకట శైలేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే అమరవీరుల సంస్మరణ సందర్భంగా శ్రద్దాంజలి ఘటించడం, సంస్మరణ తీర్మానం చేసేందుకు ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి జడ్పీ గౌరవ సభ్యులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.