గుమ్మడిదల, ఫిబ్రవరి14: పచ్చని పంటలు, చెరువులు, పర్యాటకానికి నెలవైన గుమ్మిడిదలలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటుతో ప్రభుత్వం ఈ ప్రాంతంలో కుంపటి పెట్టాలని చూస్తున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదలలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, డీసీసీబీ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్‌యార్డు నిర్మాణానికి పదిరోజుల క్రితం మంగళవారం అర్ధరాత్రి పోలీసు బలగాలను గ్రామాలకు పంపి నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి సంగారెడ్డికి తరలించి తమది ఎమర్జెన్సీ పాలన అని కాంగ్రెస్ మరోసారి నిరూపించిందని ఆరోపించారు. ఆ రాత్రి మహిళలు నిద్రలేకుండా భయభ్రాంతులతో కాలం గడిపితే, జీహెచ్ఎంసీ అధికారులు వందల సంఖ్యలో టిప్పర్లతో డంపింగ్‌యార్డు పనులు రాత్రికి రాత్రే చేయడం వెనుక మతలబు ఏమిటీ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఈ ప్రాంత రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి వారి భూములు సాగుకు పనికి రాకుండా చేసి మరో లగచర్లగా మార్చవద్దని ప్రభుత్వానికి హరీశ్‌రావు సూచించారు. డంపింగ్‌యార్డుకు దిగువ ప్రాంతంలో ఉన్న నర్సాపూర్ రాయచెరువు పర్యాటకానికి చిరునామా అని, ఇది పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. మత్స్యకారుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. దుండిగల్ ఎయిర్‌పోర్స్ అకాడమీకి ఇబ్బందులు తప్పవన్నారు. దీనిపై ఇప్పటికే రైతు జేఏసీ నాయకులు అకాడమీ కమాండర్‌కు వినతి పత్రాన్ని అందజేశారని గుర్తుచేశారు.
కమాండర్ కలెక్టర్‌కు, తమ పైఅధికారులకు సైతం లెటర్లు పంపినట్లు చెప్పారు. డంపింగ్‌యార్డు పనులు నిలిపి వేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసినా ప్రధాన గేటు, రోడ్డు పనులు చేపడుతున్నారని, దీనికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ బాధ్యులు అవుతారని హరీశ్‌రావు సూచించారు. అసెంబ్లీ వేదికగా ఈ సమస్యపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి డంపింగ్‌యార్డు ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని, లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కార్యక్రమంలో రామచంద్రాపురం సీనియర్ నాయకుడు ఆదర్శ్‌రెడ్డి, కొలను బాల్‌రెడ్డి, జి.వెంకటేశంగౌడ్, రాజేశ్, చంద్రాగౌడ్, చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్, యావన్నగాని సంతోష్‌రెడ్డి, చిమ్ముల నర్సింహరెడ్డి, రాజశేఖర్, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనే డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయాలన్న కోర్టు నిబంధనలు కాంగ్రెస్ సర్కారు తెలియవా. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్యారానగర్ అటవీ ప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడంతో ఇక్కడి భూములు, గాలి కలుషితం అవుతాయి. ఎవుసం దెబ్బతిని రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఈ ప్రాంతం పూర్తిగా కలుషితమవుతుంది. దిగువ ప్రాంతంలోని నర్సాపూర్ రాయచెరువు పూర్తిగా కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. దిగువభాగంలోని చెరువులు, కుంటలు కలుషితం అవుతాయి. వేల మంది రైతుల బతుకులు ఆగమైతాయి. పది రోజులుగా వినూత్నంగా నిరసనలు చేయడం అభినందనీయం. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రభుత్వం డంపింగ్‌యార్డు ఏర్పాటు పనులను ఆపాలి. -సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను హింసించే పాలన. మా ప్రాంతంలో 2 వేల ఎకరాల్లో రైతులను భూములు గుంజుకోవాలని ప్రయత్నిస్తే హరీశ్‌రావు చొరవతో మాకు న్యాయం జరిగింది. లగచర్లలో రైతుల భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు బేడీలు వేసి హింసించిన ఘనత రేవంత్ సర్కారుకు దక్కింది. ఎక్కడ చూసినా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పార్యానగర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటుతో ఇబ్బందులు వస్తాయని నిరసనలు చేస్తుంటే ఇప్పటి వరకు సీఎం స్పందించకపోవడం దారుణం. వెంటనే డంపింగ్‌యార్డు పనులు నిలిపి వేచాలి. లేకపోతే మరో లగచర్ల పోరాటాన్ని చూడాల్సి వస్తది.
– మాణిక్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే