చేర్యాల, అక్టోబర్ 28: తెలంగాణ సర్కారు రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పదేండ్లలో రైతులు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. వానకాలం పంట చేతికి రావడంతో 25 రోజుల క్రితమే సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని రైతులు వరి కోతలు ప్రారంభించారు. పంట పొలాల్లో కోత కోసి నేరుగా రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రదేశానికి ధాన్యం తీసుకువచ్చి రాశులు పోస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేర్యాల మండలంలో 21, ఉమ్మడి మద్దూరు మండలంలో 20, కొమురవెల్లి మండలంలో 8 కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇందులో కొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించినప్పటికీ కొనుగోలు ప్రారంభం కాలేదు. మరికొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించలేదు. సకాలంలో అధికారులు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తారని భావించినా రైతులకు చేదు అనుభవం ఎదురైంది. ధాన్యం తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసి రాశుల వద్ద రక్షణ కోసం కాపలా ఉంటున్నారు. కొన్ని గ్రామా ల్లో ఇప్పట్లో కేంద్రాలు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడం, కేంద్రాలు ప్రారంభించిన గ్రామాల్లో కాంటా కాకపోవడంతో రైతులు తక్కువ ధరకు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర రూ.2303(ఏగ్రేడ్), 2280 కామన్ రకానికి ఉండగా, రైతులు మిల్లుల్లో రూ.1800 నుంచి 1850 (క్వింటాల్) చొప్పున విక్రయించి నష్టపోతున్నారు. మిల్లుల్లో ధాన్యం విక్రయాలు జరిపిన రైతులకు వెంటనే డబ్బులు కావాలంటే 2శాతం కటింగ్‌తో కొందరు మిల్లర్లు డబ్బులు చెల్లిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, వర్షాలు కురుస్తుండడంతో వరి పంటను విక్రయించుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు అక్కడ ఎలాంటి వసతులు కల్పించడం లేదు. తాగునీటి వసతి, టార్పాలిన్లు, టెంట్లు, ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు, జల్లి చేసేందుకు యంత్రాలు ఇప్పటి వరకు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయలేదు. మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటా కావడం లేదు. దీంతో మధ్య దళారులు లారీ, ట్రాక్టర్లు తీసుకువచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నిబంధనల మేరకు దళారులు కేంద్రాల వద్దకు వచ్చి కొనుగోలు చేయవద్దు కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితుల వల్ల దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లోని కేం ద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి రైతులను ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పండించిన ధాన్యం కేంద్రంలో అమ్ముకుందామని తీసుకువచ్చి నెల రోజులు అవుతున్నది. రోజూ ధాన్యం కుప్పులను ఆరబోయడం తిరిగి రాశి చేసి ఇంటికి వెళ్లడం పరిపాటిగా మా రింది. కేంద్రం తెరిచి కాంటా పెట్టకపోవడంతో తక్కువ ధరకు ఇవ్వాలని కొందరు దళారులు తిరుగుతున్నారు. ఇప్పటికే పది లారీల వరకు కొనుగోలు చేశారు. తక్కువ ధరకు ఇవ్వడం ఇష్టం లేక నేను విక్రయించలేదు. అధికారులు చర్యలు చేపట్టి రైతు లు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పు డు కొంటేబాగుంటది.
– శనిగరం కనకయ్య, రైతు, ఆకునూరు, సిద్దిపేట జిల్లా
సోమవారం కొను గోలు కేంద్రం ప్రా రంభించారు. కానీ, కాంటా ఎప్పుడు పెడతారో తెల్వదు. వచ్చిన ధాన్యం వచ్చినట్లు కొంటే రైతుల కు మేలు చేసినట్లు అవుతుంది. కేంద్రాల వద్ద పరదాలు ఇవ్వాలి, కేంద్రం ఏర్పాటు చేసిన ప్రదేశంలో గడ్డి, చెత్త ఉండడం వల్ల రైతుకు ఇబ్బంది కలుగుతున్నది. వసతు లు కల్పించి తొందరగా ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటుంది.
– ముత్యం నాగరాజు, రైతు, కొమురవెల్లి, సిద్దిపేట జిల్లా