అక్కన్నపేట, డిసెంబర్ 1: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఎస్సీ రిజర్వేషన్ ఖరారు కావడంతో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు మండల కేంద్రానికి చెందిన టేకుల కుమార్ అనే యువకుడు దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. లక్షల జీతం వదులుకొని ఉన్న ఊరుకు సేవ చేసేందుకు ముందుకు వచ్చాడు. యువకులు, గ్రామస్తులు సహకరించి సర్పంచ్‌గా గెలిపిస్తే తాను తయారు చేసుకున్న మ్యానిఫెస్టోను వందశాతం అమలు చేస్తానని చెబుతున్నాడు కుమార్. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేశాడు. 2005 నుంచి 2013 వరకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పిడమర్తి రవి, తుంగబాలు తదితరులతో కలిసి పనిచేశాడు.
అతడితో ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది స్నేహితులు నేడు పలు ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 2014లో దుబాయ్‌కు వెళ్లిన కుమార్ కొద్ది రోజుల పాటు అక్కడ తగిన ఉద్యోగం దొరకక సెక్యూరిటీ గార్డు పని చేశాడు. ప్రస్తుతం దుబాయ్‌లోని బ్రిటిష్ అకాడమీకి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. సుమారు లక్షకు పైగా నెల జీతం సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కన్నపేట గ్రామ పంచాయతీ ఆవిర్భావం నుంచి మొదటి సారి సర్పంచ్ ఎస్సీ రిజర్వు కావడంతో స్కూల్లో రిజైన్ చేసి మూడు రోజుల క్రితం అక్కన్నపేటకు చేరుకున్నాడు. ఉద్యమ అనుభవం, నాయకుడి లక్షణాలు ఉండడంతో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు రంగంలోకి దిగాడు. ప్రజలు కుమార్‌కు పట్టం కడుతారో లేదో ఈ నెల 17వ తేదీ వరకు వేచి చూడాలి.