సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 13: రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని, సీఎం రేవంత్‌కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎద్దేవా చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరహార దీక్షకు శుక్రవారం ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలిచ్చాడని, తీరా గద్దెకెక్కాక అన్నివర్గాలను మోసం చేశాడని దుయ్యబట్టారు.
ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం పెడతామని రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు కాంగ్రెస్ నేతలు చేసిన వాగ్ధ్దానాలు బుట్టదాఖలు అయ్యాయని విమర్శించారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న ప్రభుత్వం 365 రోజులు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. 2023 సెప్టెంబర్ 13న వరంగల్‌లో నిర్వహించిన దీక్షా శిబిరానికి అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ హాజరై సమగ్ర శిక్షా ఉద్యోగులకు మద్దతు తెలిపారని, తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు.
వారికి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చింతా ప్రభాకర్ అన్నారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్లు విజయేందర్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు, పార్టీ కంది మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.