హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 21: ఆదాయాన్ని ఎందుకు పెంచుకోవడం లేదు. ఇండ్ల (డొమెస్టిక్)పేరిట అనుమతులు తీసుకుని (కమర్షియల్) వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఎందుకు పన్నులు సవరించి వసూలు చేయడం లేదు. నోటీసులు ఇవ్వండి.. పన్నులు వసూలు చేయండి.. ఇదీ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలు. దీంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలపై పన్నుల అదనపు భారాన్ని మోపుతున్నారు.
హుస్నాబాద్ పట్టణాన్ని మున్సిపల్ అధికారులు నాలుగుజోన్లుగా విభజించారు. ఇందులో వ్యాపారాలు నిర్వహించే ప్రాంతాలు, నివాస ప్రాంతాలను వేర్వేరుగా విభజించారు. జోన్ 1లో హుస్నాబాద్ బస్‌స్టేషన్, మేడిబావివీధి, జోన్ 2లో కరీంనగర్రోడ్, గాంధీరోడ్డు, శివాలయంవీధి, జోన్ 3లో విద్యానగర్, గణేశ్‌నగర్, రెడ్డికాలనీ, జోన్4లో ఆరపల్లి, పోచమ్మవీధి తదితర ప్రాంతాలుగా గుర్తించారు. ఇలా ఆయా ప్రాంతాల్లోని వ్యాపారాలు, నివాస ప్రాంతాలకు వేర్వేరుగా ఆస్తిపన్నును విధించారు. హుస్నాబాద్ పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం పట్టణంలో 7302 ఇండ్లు ఉండగా, ఇందులో 579 వ్యాపారాలు నిర్వహించే దుకాణాలు ఉన్నాయి. వీటిద్వారా ఏటా మున్సిపల్‌కు 1.38 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వస్తున్నది. మున్సిపల్ నుంచి నివాసం (డొమెస్టిక్) పేరిట అనుమతులు పొంది 1500కుపైగా (కమర్షియల్) దుకాణాలుగా వినియోగిస్తున్నారని మున్సిపల్ అధికారులు తేల్చారు.
వీటికి తోడు హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 1500మంది దుకాణాల కోసం ఆన్లైన్లో ట్రేడ్ లైసెన్సులు తీసుకున్నట్లు కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎం) గుర్తించింది. వీరందరికీ అదనంగా పన్నులు వేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆస్తిపన్ను ద్వారా వస్తున్న 1.38 కోట్ల రూపాయల ఆదాయానికి తోడు మరో కోటిరూపాయల ఆదాయాన్ని పెంచేందుకు మున్సిపల్ అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుకు అదనంగా వందశాతం అపరాధ రుసుమును ఆయా యజమానులకు వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
దీంతో 1500మందికిపైగా యజమానులకు నోటీసులు జారీచేయడమే కాకుండా అదనపు పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. పన్నులు చెల్లించకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొనడంతో ఒక్కసారిగా ఇంతభారం మోపడమేంటని పలువురు యజమానులు వాపోతున్నారు. అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలనే తపనతో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడీఎం నుంచి మాత్రం పన్నులతో ఆదాయాన్ని పెంచాల్సిందేనంటూ ఎప్పటికప్పుడు తాఖీదులు మాత్రం అధికారులకు వస్తున్నాయి. దీంతో పన్నుల బాదుడు తప్పడం లేదని మున్సిపల్ అధికారులు యజమానులకు స్పష్టం చేస్తున్నారు.
నివాసగృహాలను కమర్షియల్‌గా మార్చుకున్న వారికి నోటీసులు ఇచ్చాం. అనుమతులు తీసుకున్న వాటికి కాకుండా వ్యాపారపరంగా నిర్వహించేవాటిని గుర్తించి నోటీసులు జారీచేశాం. పట్టణంలో ప్రస్తుతం ఉన్న ఆదాయానికి తోడుగా కోటిరూపాయలకుపైగా పన్ను వసూలు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
-టి.మల్లికార్జున్‌గౌడ్, కమిషనర్ హుస్నాబాద్ మున్సిపల్, సిద్దిపేట జిల్లా