సిద్దిపేట, మార్చి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతోపాటు జనగామ జిల్లాలోని బచ్చన్నపేట రైతులకు కష్టాలు వచ్చాయి. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించే తపాస్‌పల్లి రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉంది. దీనిని 0.3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీనికింద ఆయకట్టు 82,542 ఎకరాలుగా ప్రతిపాదించారు. కుడి కాల్వ ద్వారా 48,000 ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 34,542 ఎకరాలు ప్రతిపాదించారు. పనులు పూర్తి కాకపోవడం మూలంగా 50శాతం మేర మాత్రమే సాగు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇంతవరకు నీటిని విడుదల చేయలేదు. దీంతో పంటలకు సాగునీరు అందే పరిస్థితి లేదు.
సాగు నీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ రిజర్వాయర్‌కు దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి బొమ్మకురు రిజర్వాయర్‌కు అక్కడి నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బొమ్మకురు రిజర్వాయర్ సైతం డెడ్‌స్టోరేజీలో ఉంది. దీంతో తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చే పరిస్థితులు లేవు. ఫలితంగా ఈ రిజర్వాయర్ ఆయకుట్టు అంతా ఎండిపోతుంది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిఏటా ఈ రిజర్వాయర్ నుంచి చేర్యాల, కొమురవెల్లి మండలంలోని 38 వేల ఎకరాలకు, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని 24 వేల ఎకరాలకు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో 6వేల ఎకరాలకు సాగునీరందించారు. కొండపాక మండలంలోని కొన్ని గ్రామాలకు సాగునీరందించడంతో దాదాపుగా 50వేల ఎకరాలకు పైగా ఆనాడు కేసీఆర్ సాగునీరు అందించారు. ఈ నాలుగు మండలాల్లోని అన్నీ చెరువులను నింపడంతో మండుటెండ ల్లో సైతం మత్తళ్లు దుంకాయి.
ఇవ్వాళ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సాగు నీటి రంగాన్ని పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పెండింగ్ పనులను పూర్తి చేయలేక పోయింది. సాగు నీటి నిర్వహణను గాలికి వదిలేసింది. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు బావులను లోతు చేస్తున్నారు. నూతన బోరుబావులను తవ్విస్తున్నారు. ఏం చేయలేని రైతులు ఎండిన పంటలను పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు విడుదల చేయాలని నాడు కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. కరువు ప్రాంతంగా పిలువబడే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు గోదావరి జలాలు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. లింకు కాల్వల నిర్మాణానికి రూ.388.20 కోట్లు మంజూరు చేసింది. లింకు కాల్వల నిర్మాణం చేపట్టి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలతో తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపాలని సంకల్పించారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదుల (చొక్కారావు ఎత్తిపోతల పథకం) ఫేస్-2,3 ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపుతున్నారు.
నాడు కేసీఆర్ ఈ ప్రాంతానికి ఇచ్చిన మాట ప్రకారం భారీగా నిధులు కేటాయించి పనులు చేయించారు. దాదాపు 40శాతం మేర పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే ఎన్నికలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పనులకు బ్రేకులు పడ్డాయి. ఫలితంగా సాగు నీటి కాల్వల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పనులు పూర్తి చేసి ఉంటే నాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుండే. దాదాపుగా ఈ ప్రాంతంలో 1,29,630 ఎకరాలకు సాగునీరు అందుతుండే.. కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతోపాటు భూసేకరణ చేయకపోవడంతో అన్ని సాగునీటి పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు భగ్గుమంటున్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని రైతులు కోరుకుంటున్నారు.
కేసీఆర్ హయాంలో ఎటుచూసినా గోదావరి జల సవ్వడులు కనిపించగా.. కాంగ్రెస్ హయాంలో ఎటుచూసినా ఎండిన చెరువులు, అడుగంటిన బోరుబావులు, డెడ్ స్టోరేజీలో రిజర్వాయర్లు, ఎండుతున్న పంటలు దర్శనిమిస్తున్నాయి. ఏ ఊరికెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో దిగాలుగా ఉన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంతోషంగా సాగు చేసుకున్న రైతులు, ఇవ్వాళ సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి పడరానిపాట్లు పడుతూ తనలోతాను కుమిలిపోతున్నారు. సాగునీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. వాటని కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అయినా పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. వేల ఎకరాలకు సాగునీరు అందించే తపాస్‌పల్లి రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉంది..లద్దునూరు రిజర్వాయర్‌లో చుక్కనీరు లేదు. పంట కాల్వల్లో పిచ్చిచెట్లు మొలిచాయి. దీంతో సాగునీరు రావడం కష్టంగానే ఉంది.
ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని ఎత్తిపోసేందుకు బహుబలి మోటర్లు, కాలువలు ఉన్నా సర్కారు రైతులకు సాగునీరు ఇవ్వడంలో పూర్తి విఫలమైంది. పంటలు కాపాడటంలో కాంగ్రెస్ సర్కారు కుంటిసాకులు వెతుకుతున్నది. దేవాదుల నిర్వాహక సంస్థకు సకాలంలో వేతనాలు, మెయింటెనెన్స్ చార్జీలు ఇవ్వకపోవడంతో అధికారులు, సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో ఉన్న జలాలు కాస్తా వెళ్లిపోవడంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు రాకపోవడానికి అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యమే, వస్తున్న నీటిని సైతం రిజర్వాయర్లకు రాకుండా కొందరు ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు విడుదల చేయాలని పలుమార్లు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడితే నామమాత్రంగా నీటిని వదిలి తిరిగి పంపులు బంద్ పెట్టారు. ప్రభుత్వ పట్టింపు లేని తనం, అధికారుల నిర్లక్ష్యంతో చేర్యాల ప్రాంతంలోని 68 ఎకరాల ఆయకట్టు ఎండిపోతున్నది. బోరుబావుల్లో నీటిచుక్క రావడం లేదు. ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాల్సిందే. రైతులతో ఉద్యమాలు చేయించాల్సిన సమయం అసన్నమైంది.
– రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే