చేర్యాల, మే 27 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎన్నడూ ఎండిపోని తపాస్‌పల్లి రిజర్వాయర్ కాంగ్రెస్‌లో మొదటిసారి ఎండిపోయిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని రేణుకా గార్డెన్స్‌లో చేర్యాలటౌన్, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు రూ.16,13,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులు రూ.6కోట్లు మంజూరు చేసేందుకు పైసలు ఉండవని, అందాల పోటీలకు మాత్రం ఉంటాయంటే సర్కారు పరిస్థితి ఏమిటో ప్రజలు గమనించాలని కోరారు.గోదావరిలో సరిపడా జలాలు ఉన్నా దేవన్నపేట వద్ద పంపుహౌస్‌లో నాలుగు మోటర్లు ఆన్ చేస్తే సరిపోతుందన్నారు. నాడే కేసీఆర్ నీటిని ఎత్తిపోసేందుకు సరిపడా మోటర్లు ఏర్పాటు చేయించారని, ఆమోటర్లు ఆన్ చేసి నీళ్లు పోయించడం సర్కారుకు చేతకాకపోతే ఏమిటని ప్రశ్నించారు.
మహిళలకు రూ.2500 ఇవ్వలేదని, తులం బంగారం లేదని, వృద్ధులకు పింఛన్ ఇస్తలేరని కానీ అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు చేశారని హేద్దేవా చేశారు. చేర్యాల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు బీఆర్ఎస్ సర్కారు నిధులు మంజూరు చేసి నూతన దవాఖాన భవనానికి శ్రీకారం చుడితే పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నదని, దీంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత దవాఖాన నీలిమాలో నియోజకవర్గానికి చెందిన 400 మందికి నిత్యం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నానని, మరో మూడేండ్ల పాటు వైద్య సేవలు కొనసాగుతాయన్నారు.
తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లు ఎండబెడితే ఎందుకు నీళ్లు నింపడం లేదని అసెంబ్లీలో సమయం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని సంబంధిత మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. గతంలో రిజర్వాయర్లు నింపి చెరువులు నింపారని, ఇప్పుడు తపాస్పల్లిని ఎందుకు ఎడ్డబెట్టారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ టౌన్, మండల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, మల్లేశం, సంతోష్, యాదగిరి, భిక్షపతి, మాజీ ఎంపీపీలు మేడిశెట్టి శ్రీధర్, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తనకిషన్, మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి,ముఖ్య నాయకులు శ్రీధర్‌రెడ్డి, ముస్త్యాల బాల్‌నర్సయ్య, రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సయ్యపంతులు పాల్గొన్నారు.