వానకాలంలో రోగాల వ్యాప్తికి అవకాశం
సంగారెడ్డి జిల్లాలో 6,67,786 గొర్రెలు, మేకలు
నేటి నుంచి నట్టల నివారణ మందుల పంపిణీ
80 బృందాల ఏర్పాటు
అందుబాటులో 85 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు,103 చాప్ కట్టర్లు
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 7: మృగశిర కార్తెలోకి వెళ్తున్న వేళ, రుతు పవనాల ఆగమనంతో తొలకరి పలకరింపు సమయం ఆసన్నమైనది. దీంతో జీవాలకు నట్టల సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని 6,67,786 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ నెల 14 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో గ్రామాల వారీగా మందుల పంపిణీ కోసం 80 బృందాలు ఏర్పాటుచేశారు. జిల్లాకు 85 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు, 103 చాప్ కట్టర్లు మంజూరైనట్లు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ వసంతకుమారి తెలిపారు. జిల్లాలోని గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జీవాల్లో నట్టల నివారణ ప్రాముఖ్యత
గొర్రెలు, మేకల్లో ఏలిక పాములు, బద్దె పురుగులు, లివర్ ఫ్లూక్ తదితర అంతర్ పరాన్న జీవులతో అనేక అనర్థాలు సంభవించి గొర్రెలు, మేకల పెంపకందారులు 30 శాతం ఆదాయం కోల్పోతారు. పశువుల్లో కంటే జీవాల్లో పరాన్న జీవుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వాటి ఆహారపు అలవాట్ల దృష్ట్యా మేకల కంటే గొర్రెల్లో పరాన్న జీవుల సమస్య ఎక్కువగా ఉంటుంది. సరైన మేత దొరకనప్పుడు, ఈ పరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన నీరు తాగడం, మేతతో ఈ ప్రభావం ఏర్పడుతుంది. శరీరం, కాలేయం, ఊపిరితిత్తులు, ప్రేగులు, జీర్ణాశయం తదితర అంతర్గత అవయవాల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి. తద్వారా జీవాల పొషక పదార్థాలు, రక్తాన్ని స్వీకరించి రక్త హీనతకు గురిచేస్తాయి. దీంతో గొర్రెలు బరువు పెరగవు. ఎంతమేపినా చిక్కిపోతుంటాయి. ఆకలి లేకపోవడం, పొట్టలావు, దవడ కింద నీరు చేరడం, విరేచనాలు తదితర లక్షణాలు ఏర్పడుతాయి.
నట్టల నివారణతో కలిగే లాభాలు
నట్టల నివారణ మందులను ఇవ్వడంతో జీవాల్లో (గొర్రెలు, మేకలు) వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయా జీవాలు ఆరోగ్యవంతంగా, త్వరగా ఎదుగుతాయి. రక్తహీనత తగ్గుతుంది. జీవాలు తిన్న ఆహారం సక్రమంగా వినియోగించుకుని అధిక మాంసోత్పత్తి జరుగుతుంది.
103 చాప్ కట్టర్లు, 85 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు
జిల్లాకు 103 చాప్ కట్టర్లు, 85 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు మంజూరయ్యాయి. ప్రతి ఐదు కిలోల బస్తాకు రూ.61 చెల్లించి తీసుకోవాలి. 2హెచ్పీ- 3బ్లేడ్ చాప్ కట్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం జీవాల ఆరోగ్యానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందుకు 80 బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల వారీగా అన్ని జీవాలకు నట్టల నివారణ మందులు వేస్తారు. జిల్లాలోని గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి. దళితబంధు రైతులు ప్రభుత్వం అందిస్తున్న గడ్డి విత్తనాలు తీసుకుని వారి జీవాల వృద్ధికి కృషి చేయాలి.
– డాక్టర్ వసంత కుమారి,
జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి, సంగారెడ్డి