పటాన్చెరు, నవంబర్ 15: ఫిలిప్పిన్స్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో నివసించే చింతా అమృతరావు మెదక్‌లో విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె చింతా స్నిగ్ధ(20) ఎంబీబీఎస్ అభ్యసించేందుకు 2021లో ఫిలిఫ్పిన్స్ వెళ్లింది.
అక్కడి పెర్ఫెక్చువల్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌లో రెండో ఏడాది చదువుతుంది. గురువారం అర్ధరాత్రి గదిలో ఉన్న స్నిగ్ధకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తోటి విద్యార్థినులు వచ్చారు. గదిలో ఉన్న స్నిగ్ధ తలుపులు తెరవకపోవడంతో ఇండియాలోని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. బలవంతంగా తలుపులు తెరవాలని కుటుంబసభ్యులు సూచించడంతో తలుపులు తెరిచారు. స్నిగ్ధ గదిలో విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా చూపించారు. శుక్రవారమే స్నిగ్ధ పుట్టినరోజు కావడంతో వారి బాధ వర్ణణాతీతంగా మారింది. తన కుమార్తె మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.