మెదక్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి 8వ తేదీ వరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే చేపట్టనున్నారు. మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో రెండు చొప్పున ఎంపిక చేయగా మొత్తంగా 954 కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల వివరాలు నమో దు చేయడమే కాక మార్పులు, చేర్పులు ఉంటే నమో దు చేయనున్నారు. కుటుంబ సభ్యులందరూ అనుమతిస్తేనే కార్డు కోసం ఫొటో తీసుకుంటారు. ఈ డిజిటల్ సర్వేలో 11 బృందాలు పాల్గొనగా, ఒక్కో బృందంలో నలుగురు అధికారులు ఉంటారు. ఆయా అధికారులు సర్వేను పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తారు.
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నాలుగు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంరంపేట మండలం కామారం గ్రామంలో 146 కుటుంబాల వివరాలు సేకరిస్తారు. మెదక్ మున్సిపాలిటీలోని 20వ వార్డు దాయరలో 407 కుటుంబాలకు సర్వే నిర్వహిస్తారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని గొల్లపల్లి గ్రామంలో 155 కుటుంబాలు, మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు హనుమాన్ వీధి ప్రాంతంలో 246 కుటుంబాలకు సంబంధించి డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే ప్రారంభిస్తారు. క్షేత్ర స్థాయిలో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే నిర్వహణకు 11 బృందాలు నియమించగా, ఒక్కో బృందంలో నలుగురు అధికారులు ఉంటారు.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రకరకాల గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డు ఇలా అన్నింటినీ కలిపి డిజిటల్ కార్డు జారీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. రేషన్ కార్డు, పింఛన్లు, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర వివరాల డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంది. కానీ ఇది సరైనదేనా అని నిర్ధారించుకుంటున్నారు. దీంతో ఆ కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే పేర్ల్లు తొలిగించి, కొత్త వారివి నమోదు చేస్తారు. ఆ తర్వాతనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేయనున్నారు.
మెదక్ జిల్లాలో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే నిర్వహణలో భాగంగా తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మున్సిపాలిటీ వార్డు అధికారులకు శిక్షణ ఏర్పాటు చే యడం జరిగిందని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో జిల్లాలోని సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మున్సిపాలిటీ వార్డు అధికారులకు డిజిటల్ ఫ్యా మిలీ కార్డుసర్వే నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు.
డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వేకు ప్రజలు సహకరించాలి. జిల్లా లో రెండు నియోజకవర్గాల్లో డి జిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే చేపట్టడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా మెదక్ నియోజకవర్గంలో రెండు ప్రాంతా లు, నర్సాపూర్ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల ను ఎంపిక చేశాం. 11 బృందాలను నియమించాం. 3వతేదీ నుంచి 8వతేదీ వరకు సర్వే కొనసాగనున్నది.
– వెంకటేశ్వర్లు, మెదక్ అదనపు కలెక్టర్