పటాన్చెరు, మే 17: వానకాలం సమీపిస్తున్నా వ్యవసాయశాఖ విత్తనాలు, ఎరువుల సరఫరాపై దృష్టి సారించడం లేదు. ఎరువులు, విత్తనాల విక్రయాలపై తనిఖీలు చేయడం లేదు. పటాన్చెరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లోని పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో ఎక్కువ మంది రైతులు వర్షాధార పంటలతో పాటు చెరువులు, బోరుబావుల వద్ద వానకాలంలో వరి, పత్తి పంటలు సాగుచేస్తుంటారు.
కొందరు రైతులు కూరగాయలు సాగుచేస్తారు. విత్తన వ్యాపారులు ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లూజు విత్తనాలు తెచ్చి, రంగురంగుల ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి, ఇక్కడ ప్రతి ఏడాది అమ్మకాలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పంట దిగుబడి రాక, తీవ్రంగా నష్టపోతున్నారు.
ఏటా సీజన్లో నకిలీ విత్తనాల అమ్మకాలు నివారించేందుకు ట్రాస్స్ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసినా తనిఖీలు సరిగ్గా చేయడం లేదనే అపవాదు ఉంది. మరో 15 రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానున్నా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేయడం లేదు. గ్రామాల్లో రైతులకు ఇప్పుటి వరకు భూసార ఫలితాలు అందించలేదు. ఈ సీజన్లో రైతులు తమ భూముల్లో ఏ పంటలు సాగు చేయలో తెలపడం లేదు.
ఇదో పెద్ద దందా…
విత్తన కంపెనీలు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో మూతపడిన ఫ్యాక్టరీలను లీజ్‌కు తీసుకొని లూజు విత్తనాలు కొనుగోలు చేసి, రంగురంగు ప్యాకెట్లో ప్యాకింగ్ చేసి తెలంగాణలోకి తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటుచేసి విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు రైతులకు ఉద్దెరకు నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. దీంతో దిగుబడులపై ప్రభావం పడుతున్నది. విత్తనాలు ఇచ్చినందుకు పంట చేతికి వచ్చిన తర్వాత కల్లాల్లోనే తూకం వేసి పంటను తీసుకుంటున్నారు.
మరికొందరు రైతులు వడ్డీతో కలిపి అసలు తీసుకుంటున్నారు. రైతుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో కొందరు వ్యాపారులు ఆశచూపి చెప్పిన ధరకు విత్తనాలు కొనుగోలు చేయిస్తున్నారు. విత్తనాలు నకిలీవా, కావా అని రైతులు పరిశీలించడం లేదు. ఎక్కువ మంది వ్యాపారులు లూజు విత్తనాలు ప్యాకింగ్ చేసి అమ్మకాలు చేస్తుండడంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. వ్యవసాయశాఖ పర్యవేక్షణ సరిగ్గా లేక విత్తన వ్యాపారులు జోరుగా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ విత్తన వ్యాపారానికి సీడ్ ఆర్గనైజర్లు అసలు సూత్రదారులుగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.