హుస్నాబాద్, జూన్ 14: హుస్నాబాద్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మిగులు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హుస్నాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 90శాతం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందన్నారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉండగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. సుమారు 300 మంది లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అద్దె ఇండ్లల్లో ఉంటూ జీవనం వెల్లదీస్తున్న నిరుపేదల కోసం మంత్రి కనీసం దృష్టిసారించకపోవడం అన్యాయమన్నారు. పలుమార్లు మంత్రికి, అధికారులకు వినతిపత్రం అందజేసినా పట్టించుకోకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గందె చిరంజీవి, కందుకూరి సతీశ్, బత్తుల జీవన్, ఉల్లెంగుల రాజు, లబ్ధిదారులు పున్న లక్ష్మి, ప్రియ, జేరిపోతుల సునీత, పద్మ తదితరులు పాల్గొన్నారు.