సంగారెడ్డి, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్పవిషయమని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసు కార్యాలయంలో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్‌ను ప్రారంభించారు. అనంతరం భవానీ మందిర్, శుక్రవారం మార్కెట్ ప్రాంతంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారి ఆర్థిక సాయం రూ.2.45 కోట్లతో నిర్మించిన కేంద్రాన్ని ప్రారంభించారు. భరోసా కేంద్రాన్ని డీజీపీ అడిషనల్ డీజీపీ శిఖాగోయల్, సంగారెడ్డి కలెక్టర్ శరత్‌కుమార్, ఎస్పీ రమణకుమార్, టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా మహిళల భద్రతకు భరోసా కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మహిళల భద్రత, ఇక్కడి పథకాలతో పాటువారి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభినందించారని గుర్తుచేశారు. ఈలాంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారన్నారు. పిల్లలు, మహిళలకు ఒకే దగ్గర భద్రత ఏర్పాటు వసతులు కల్పించడం తెలంగాణ ప్రభుత్వ గొప్పతనమన్నారు. శాంతిభద్రతలకు ప్ర భుత్వం ప్రధాన్యత కల్పిస్తూ, నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. మానసికంగా, లైంగికంగా, వేధింపులకు గురైన మహిళలు వెం టనే భరోసా కేంద్రాలను అశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. భరోసా కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా భరోసా కేంద్రం పనిచేస్తుందని, వైద్య, చట్టపరమైన, మానసిక కౌన్సెలింగ్‌లు చేసి మద్దతుగా నిలిచి అత్యవసర, సాధారణ సేవలను అందిస్తుందన్నారు.
మహిళల భద్రతకు భరోసా కేంద్రాన్ని నిర్మించేందుకు కలెక్టర్ శరత్‌కుమార్, ఎస్పీ రమణకుమార్, అరబిందో ఫౌండేషన్ ప్రతినిధులు నిత్యానందారెడ్డి, సదానందరెడ్డి సేవలు గొప్పవని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. జిల్లాలో చాలా కాలంగా పలు విద్యాసంస్థలు, కమ్యూనిటీ భవనాలు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, తాగునీటి సమస్యకు నిధులు వంటి సామాజిక సేవలకు ఆర్థికంగా ఆదుకోవడం గొప్పవిషయమన్నారు. సంగారెడ్డిలో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని తమ అభ్యర్థనతో అరబిందో ఫౌండేషన్ యాజమాన్యం ముందుకు వచ్చి 7 వేల చదరపు అడుగుల స్థలంలో రూ.2.45 కోట్లను ఖర్చుపెట్టి అధునాతన భవనం నిర్మించడం గొప్ప విషయమన్నారు. అందుకు కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షణ చేయడంతో త్వరగా భవనం పూర్తయిందని సంతోషం వ్యక్తంచేశారు. ఎస్పీ భవన నిర్మాణంలో చురుకుగా వ్యవహరించడంతో నూతన హంగులతో భరోసా కేంద్రం నిర్మాణం జరిగిందని అభిప్రాయం వ్యక్తంచేశారు. భవిష్యత్‌లో మరిన్ని సేవలు అందించి అరబిందోను ప్రజలు గుర్తించుకునేలా సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్, అదనపు ఎస్పీ అశోక్, భరోసా కేంద్ర ఇన్చార్జి దేవలక్ష్మి, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.