నర్సాపూర్, డిసెంబర్ 27: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేకుంటే సంక్రాంతి తర్వాత పేదలతో కలిసి స్వాధీనం చేసుకుంటామని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని వెల్దుర్తి మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని శనివారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన మూడేండ్లలోకి వచ్చినా ఇండ్లు ఇవ్వడం లేదని, పేదలు తన వద్దకు వచ్చి మొరపెట్టుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరితో పేదలకు గూడు కరువైందన్నా రు. పేదలు ఆత్మగౌరవడంతో బతకాలని కేసీఆర్ అన్ని వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి గుర్తుచేశారు.
స్థలం లేని, గుడిసెలు కలిగిన, కిరాయి ఇంట్లో ఉంటున్న నిరుపేదలకు సొంతింటిని నిర్మించి ఇవ్వాలని కేసీఆర్ నర్సాపూర్‌లో డబు ల్ బెడ్రూం ఇండ్లు కట్టించాడని గుర్తుచేశారు. ప్రభుత్వ మారగానే కాంగ్రెస్ పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని ఆపిందని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, కానీ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రకియ అన్నారు. దీనిని కాంగ్రెస్ విస్మరించిందన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు మినహా అన్ని పనులు పూర్తయినా డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 2017లో అప్పటి సీఎం కేసీఆర్ నర్సాపూర్‌కు 500 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారన్నారు. ఇందులో మొదటి ఫేజ్‌లో 27 బ్లాకుల్లో ఒక్కో బ్లాకుకు 12 ఇండ్ల చొప్పున మొత్తం 252 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ, కరెంట్, సీసీ రోడ్డు, సంపు కేసీఆర్ హయాంలోనే పూర్తి చేశామరన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పంపిణీకి ముందుకు రాకపోవడం దారుణమన్నారు.
ఇక్కడి పేదలు ప్రభుత్వానికి కనపడడం లేదా.. .లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకోవాలని కుట్ర చేస్తున్నారా అని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. గతంలో ఇదే స్థలంలో 1368 ఇంటి స్థలాలకు సంబంధించిన సర్టిఫికెట్లను తాను పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. అదే స్థలంలో ఇండ్లను నిర్మించి ఓ కాలనీగా ఏర్పా టు చేయాలని డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. ఫేజ్-2లో 248 ఇండ్లు ఇచ్చామని, అవి కూడా వివిధ స్టేజీల్లో ఉన్నాయన్నారు. పూర్తి చేస్తే 500 ఇండ్లు పేదలకు పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే దాదాపు 4 వేల మంది పేదలు ఇండ్లు ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. ఇవే కాకుండా ఖాళీ స్థలాలను చూసి ఇండ్లను ఇప్పి ంచే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని ఇప్పటికే మంత్రిని, ఇన్చార్జి మంత్రిని, కలెక్టర్‌ను కోరినా ఎలాంటి స్పందన లేదన్నారు. ఎమ్మెల్యే కోటా కింద 1400 ఇండ్లు ఉంటాయని, నర్సాపూర్ పట్టణంలో, నియోజకవర్గంలో పేదలకు ఇండ్లను మంజూరు చేయాలని లిస్ట్ పంపిస్తే, దాన్ని పక్కన పెట్టారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయం చేస్తూ పేదలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మీ వద్దకు వచ్చి ఇండ్లు ఇస్తామని అంటారని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో నర్సాపూర్ మున్సిపాలిటీలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, రోడ్లు, డ్రైనేజ్‌లకు రూ.40 కోట్ల నిధులు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మనువడు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడానికి రూ.100 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెడుతుందని, కానీ.. ఫేజ్-2లోని 248 ఇండ్లను పూర్తిచేయడానికి కేవలం రూ.12 కోట్లు లేవా అని ప్రశ్నించారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు లబ్ధ్దిదారులతో భారీ ర్యాలీ చేపట్టి చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ర్యాలీలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, నాయకులు చంద్రశేఖర్, భిక్షపతి, నాగరాజు గౌడ్, సత్యాగౌడ్, ప్రసాద్, షేక్ హుస్సేన్, వంజరి శ్రీనివాస్ పాల్గొన్నారు.