వెల్దుర్తి, జూన్ 19: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నెల్లూర్లో రూ. 10 లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల ప్రహరీ, పంచాయతీ పరిధిలోని పిట్టలవాడలో రూ. 5లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇవ్వడంతో నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన అన్నివర్గాలను నిండాముంచిందన్నారు. దేశానికి అన్న పెట్టే రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఏడిస్తే రాష్ర్టానికి మంచిదికాదని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రీమియం డబ్బులు కూడా కట్టలేని స్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించక, ఎరువుల కోసం యాప్‌తో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. విద్యుత్ సరిగ్గా ఇవ్వక పోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పడం రైతులను నట్టేట ముంచడమేనన్నారు. కేంద్రం ఎంత అంటే అంత ధాన్యం మాత్రమే కొంటామని చెప్పడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శమన్నారు.
ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో మండలంలోని పలు గ్రామాలకు మహిళా శక్తి భవనాలు, పాఠశాలలకు ప్రహరీలతో పాటు పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, వాటిని స్థానిక సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు నెల్లూర్ పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు. అనంతరం బస్వాపూర్‌లో నిర్వహించిన గ్రామదేవతల వార్షికోత్సవానికి హాజరయ్యారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, సర్పంచ్ రంగారెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజు, నారాయణరెడ్డి, శ్రీను, రమేశ్చందర్, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, దాసు, పలువురు సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.