నర్సాపూర్, ఏప్రిల్ 4: అర్హులందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లోని సాయికృష్ణ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. పేదలకు సన్నబియ్యంతో కడుపు నింపేందుకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రహదారులపై ప్రతి 40 కిలోమీటర్ల దూరంలో ఒక ట్రామా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సరిపడా అంబులెన్స్‌లు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. నర్సాపూర్‌లో ట్రామా కేంద్రం, సీటీ స్కాన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలలుగా నియోజకవర్గ లబ్ధిదారులు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారని, ఎట్టకేలకు వారికి శుక్రవారం అందజేసినట్లు వెల్లడించారు. కొన్ని మండలాల్లో చెక్కుల వాలిడిటీ కూడా అయిపోయాయని గుర్తుచేశారు. ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆమె కోరారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు మండలంలోని జక్కపల్లిలో 25 ఎకరాల స్థలం కేటాయించామని, మిగతా నియోజకవర్గాలకు ఇచ్చినట్లు నర్సాపూర్‌కు నిధులు మంజూరు చేయాలని మంత్రి దామోదరకు ఎమ్మెల్యే సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. చిలిపిచెడ్, మాసాయిపేట్ మండలాల్లో పీఏసీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.
నర్సాపూర్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. నర్సాపూర్‌లో బస్తీ దవాఖానకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధికార పార్టీ సహకారం ఉండాలని, మాసాయిపేట్ మండలంలో తాను లేకుండానే ప్రొటోకాల్ విస్మరించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసినందుకు ఆర్డీవో, తహసీల్దార్లపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి