కొల్చారం, ఏప్రిల్ 20: దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి రైతులకు సూచించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సోమవారం ఆమె పర్యటించారు. వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సంగాయిపేటలో మంజీరా వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత సంవత్సరం ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరిగిందని గుర్తు చేశారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ గన్నీబ్యాగులు సకాలంలో ఇవ్వలేదని, లేబర్ కొరత, మిల్లుల కేటాయింపు వంటి సమస్యల వల్ల ధాన్యం ఆలస్యంగా కొనుగోలు చేశారన్నారు. పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గన్నీబ్యాగులు, లేబర్, లారీల కొరత లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని టార్పాలిన్లతో కప్పి రక్షించాలని, తేమశాతం 17 మించి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పలువురు రైతులు సింగూరు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మంజీరా వ్యవసాయ సహకార సంఘం సభ్యులు మాట్లాడుతూ ఎఫ్‌పీవో భవనానికి ఎమ్మెల్యే రూ.30 లక్షలు మంజూరు చేశారని గుర్తు చేస్తూ భవనానికి చెందిన స్థలం వివాదంలో ఉందని, ఎమ్మెల్యే చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్థలం వివాదమేంటో చూడాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్ రత్నమ్మ ప్రభాకర్ ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
ఎమ్మెల్యే స్పందిస్తూ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని, అందులో ఎమ్మెల్యే కోటా కింద 1400 ఇండ్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం నాలుగు వందలు మాత్రమే ఇచ్చారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఎంపీడీవో రఫిక్ ఉన్నిస, ఆర్ఐ శ్రీవిద్య, సర్పంచ్ల పోరం మండల అధ్యక్షుడు రవితేజరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీ శంకర్‌గుప్తా, యువత అధ్యక్షుడు సంతోష్‌రావు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎఫ్‌పీవో సంగాయిపేట చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేందర్‌రెడ్డి, బాగారెడ్డి, ముంత్యంగారి సంతోష్, కరెంట్ రాజాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అరిగె రమేశ్, చిన్నారం ప్రభాకర్, సర్పంచ్‌లు యోహన్, రత్నమ్మ ప్రభాకర్, వినోద్‌నాయక్, మన్నె గీత రమేశ్, మోత్కు నిర్మలామల్లేశం, దొడ్ల ఆంజనేయులు పాల్గొన్నారు.