హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర’ ‘పొలిమేర-2’ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘పొలిమేర-3’ సోమవారం సికింద్రాబాద్‌లోని ఓ ఆలయంలో ఘనంగా ప్రారంభమైంది. తొలి రెండు భాగాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న డా॥ అనిల్ విశ్వనాథ్ మూడో భాగానికి కూడా దర్శకత్వ బాధ్యతల్ని తీసుకున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకాలపై వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, డి. సురేష్‌బాబు కెమెరా స్విఛాన్ చేశారు. ఫ్రాంచైజీలోని రెండు చిత్రాల తరహాలోనే అతీంద్రియ శక్తులు, అనూహ్య ఘటనలు, ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ మూడోభాగం ఆకట్టుకుంటుందని, ‘పొలిమేర’ తాలూకు ప్రపంచాన్ని మరోస్థాయిలో ఆవిష్కరించబోతున్నామని, అర్జున్ పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డా॥ అనిల్ విశ్వనాథ్ తెలిపారు. అర్జున్ సర్జా, సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్‌శ్రీను, బాలాదిత్య, రాకేందుమౌళి తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.