చిలిపిచెడ్, జూన్ 15: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు, రైతులు నమ్మేటట్లు లేరని, అందుకే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో చిలిపిచెడ్ మండలం రాందాస్ గూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలను రైతులకు వర్తింప చేయడం లేదన్నారు. ఇప్పటికే రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా చేస్తున్నారని అయినా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ చేసే ప్రతి విషయాన్ని రైతులు గమనిస్తున్నారని చెప్పారు.
చిలిపిచెడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ యాదగిరి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ అంకం దశరథ, బర లచ్చయ్య, బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు గులాబీ పార్టీలో చేరారు.