నర్సాపూర్,మార్చి 25 : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రభు త్వం దృష్టికి తెచ్చారు. ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నర్సాపూర్ మున్సిపాలిటీలో పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి 500 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారని, ఇందులో 250 ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయిందని తెలిపారు.
అర్హులకు పంపిణీ చేసేందుకు ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని, కానీ.. ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.రూ.4 కోట్లు ఇస్తే అన్ని నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, ప్రభుత్వం ఆ దిశగా కృషిచేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని ప్రస్తుతం బిల్లులు ఆపివేశారని, అలాంటి వారికి బిల్లులు తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.