హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు ఈ నెల 19 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రభుత్వం రెండేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చిందని చెప్పారు. గతంలో జారీ చేసిన జీవో నంబర్ 87 ద్వారా ఐదేండ్ల వయోపరిమితి పెంపు ఇవ్వగా.. తాజాగా జీవో నంబర్ 122 జారీ చేసిందని అన్నారు. దీంతో గతంలో ఇచ్చిన ఐదేండ్ల పెంపునకు అదనంగా మరో రెండేండ్ల వయోపరిమితి సడలింపు వర్తించనున్నదని తెలిపారు.
ఈ అదనపు వయోపరిమితి సడలింపు జూలై 29, 2026న తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లకూ వర్తిస్తుందని వెల్లడించారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్, సమాన పోస్టులు, సివిల్ ఎస్ఐ, సమాన పోస్టులు, మెకానిక్ /డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులు, ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టులు ఉన్నట్టు తెలిపారు. గతంలో వయోపరిమితి కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనున్నదని అన్నారు.