శివ్వంపేట, జూలై 11: ‘సర్’ సర్వేకు ప్రజలంతా సహకరించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన బీఎల్వోకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తన వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు అందజేశారు.
ఈ సందర్భంగా సర్వే ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఓటర్ల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారనే అంశాలపై బీఎల్వోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియను ప్రజలందరూ బాధ్యతగా తీసుకొని పూర్తి సహకారం అందించాలని కోరారు. అర్హులైన ప్రతిఒక్కరూ తమ వివరాలు సక్రమంగా నమో దు చేయించుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు వంటి అంశాల్లో నిర్లక్ష్యం చేయకుండా బీఎల్వోలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.
ఇంటింటి సర్వేకు సహకరించి సర్ కా ర్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు జిన్నారం మహిపాల్‌రెడ్డి, గంగిరెడ్డి నరసింహారెడ్డి ఉన్నారు.