నర్సాపూర్, అక్టోబర్ 29: తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు రోజులుగా మొంథా తుపాన్ ప్రభావం వల్ల మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసి నీటిలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని పాంబండ, ఖాజీపేట్, సంగాయిపేట, రంగంపేట, చిన్నఘనాపూర్, వరిగుంతం, చిలిపిచెడ్ గ్రామాల్లో వరిధాన్యం నీట మునిగి తడిసిందన్నారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంట నష్టం వివరాలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. బుధవారం మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్తో ఫోన్లో మాట్లాడి రైతులకు టార్పాలిన్లు వెంటనే అందజేయాలని కోరారు. రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.