చిలిపిచెడ్, ఆగస్టు 21: రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చిలిపిచెడ్ మండలంలోని చండూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరి యా అందజేయాలని నిర్వహించిన ధర్నాలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా జడ్పీ కో-అప్షన్ సభ్యుడు మాన్సూర్తో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులను రోడ్డెక్కించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.
రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు పోలీసులు, వ్యవసాయాధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తెచ్చిన మార్పు ఇదేనా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే, రేవంత్ దండుగ చేశారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే,నాయకులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఆందోళనలో కొల్చా రం మాజీ ఎంపీపీ మంజుల, నాయకులు రాంచంద్రారెడ్డి, రామాగౌడ్, రాజిరెడ్డి, నరేందర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, దుర్గారెడ్డి, సంతోష్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, లక్ష్మణ్, విఠల్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.