గజ్వేల్, ఏప్రిల్ 17: సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేసేందుకు గత నెలలో మార్క్‌ఫైడ్ అధికారులు ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను అధికారులు పూర్తి చేసినప్పటికీ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులు అమ్ముకునేందుకు తీసుకొచ్చిన పొద్దుతిరుగుడు పంట కుప్పలుగా పోశారు. జిల్లా వ్యా ప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో గత నెలలో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, చిన్నకోడూరు, బెజ్జంకి, హుస్నాబాద్, మిరుదొడ్డి, కట్కూర్లో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. జిల్లాలో ఈ సంవత్సరం 21324 మంది రైతులు 16131 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పం టసాగు చేశారు.ప్రతి ఎకరాకు తొమ్మిది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. నేటి వరకు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారం 1646 మంది రైతుల నుంచి 2200 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, చిన్నకోడూరు, బెజ్జంకి, హుస్నాబాద్, మిరుదొడ్డిలో ఇచ్చిన టార్గెట్ పూర్తవడంతో కొనుగోళ్లను మార్క్‌ఫైడ్ అధికారులు నిలిపివేశారు.
కట్కూర్ కేంద్రానికి రైతులు ఇప్పటి వరకు పొద్దుతిరుగుడు తీసుకురాకపోవడంతో అక్కడ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. జిల్లాలోని ఏడు కొనుగోలు కేంద్రాల ద్వారా 1646 మంది రైతుల నుంచి 2200 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడును క్వింటాల్‌కు రూ.7721 చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడుకు రూ. 16.74 కోట్లు రావాల్సి ఉంది. ఇంకా ఏడు కేంద్రాల్లో కొనుగోళ్లకు పొద్దుతిరుగుడు సిద్ధంగా ఉంది. రైతులు పండించిన పంటను అమ్ముకుందామని కొద్ది రోజులుగా మార్కెట్లకు తీసుకొచ్చారు. మొదట్లో సీరియల్ ప్రకారం కొనుగోలు చేపట్టడంతో కొంత మంది రైతులకు అవకాశం దొరికింది.
ఇంకా జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతులు పొద్దుతిరుగుడు పంట అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్ కింద రైతులు పొద్దుతిరుగుడు పంట అమ్ముకునేందుకు కుప్పలుగా పోశారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రంలో 300 మంది రైతుల నుంచి 4000 క్వింటాళ్లను మంగళవారం వరకు కొనుగోలు పూర్తి చేశారు. ఇంకా చాలా మంది రైతులకు చెందిన పొద్దుతిరుగుడు పంట కొనుగోలుకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు ఎప్పుడు అనుమతి ఇస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేకాని తిరిగి పొద్దుతిరుగుడు కొనుగోళ్లు చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలోని కొనుగోలు కేం ద్రాల్లో పొద్దుతిరుగుడు పంట అమ్మేందుకు రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇంకా జిల్లాలో సుమారు 8వేల క్వింటాళ్ల పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయలు లేక చాలామంది రైతులు ఇంటి వద్దనే పొద్దుతిరుగుడు పంటను అమ్మేందుకు సిద్ధంగా ఉంచారు.
రాష్ట్ర ప్రభుత్వ నుంచి అనుమతి రాగానే రైతుల నుంచి పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశాం. కొనుగోలుపై ఇప్పటికే పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇంకా జిల్లాలో పొద్దుతిరుగుడు పంట కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
-సునీత, మార్క్‌ఫైడ్ డీఎం, సిద్దిపేట జిల్లా