సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, మార్చి 14: ఎండా కాలం దృష్ట్యా బుధవారం నుంచి పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి 25 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ తెలిపింది.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1800 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,356 ప్రభుత్వ, 444 ప్రైవేటు, 5 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం లక్షా 30 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం 118 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో మొత్తం 1062 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 90 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు.